బ్రిటన్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం
వరసబెట్టిన రాజీనామాలు చేస్తున్న కీలక వ్యక్తులు
స్టార్మర్ దిగిపోవాలంటూ సొంత పార్టీ నుంచే డిమాండ్లు
లండన్: అమెరికాలో మొదలైన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం బ్రిటన్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా కీర్ స్టార్మర్ ప్రభుత్వ పునాదులనే కదిలిస్తోంది! సంపన్నులు, రాయబారులు, అగ్రనేతలు, రాజకుటుంబీకుల లైంగికావసరాలు తీర్చేందుకు అమాయక యువతులు, ముఖ్యంగా మైనర్లను అక్రమంగా సరఫరా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎప్‌స్టీన్ బతికున్నప్పటి కంటే చనిపోయాక ఈ అంశం మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వ పెద్దల పదవులకు ఎసరుపెడుతోంది.
ఇప్పటికే ఒకరిని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్వయంగా తొలగించగా పశ్చాత్తాపంతో మరొకరు రాజీనామా చేశారు. తాజాగా సోమవారం స్టార్మర్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ విభాగ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ అలాన్ తన పదవికి రాజీనామాచేశారు. పదవి చేపట్టిన కేవలం 5 నెలలకే ఆయన తప్పుకోవాల్సి రావడం గమనార్హం. ‘‘స్టార్మర్ ప్రభుత్వంలో కొత్త బృందం కొలువు తీరేందుకు మార్గం సుగమం చేస్తూ నేను వైదొలగుతున్నా.
ప్రధానికి, ఆయన కొత్త బృందానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’’అని టిమ్ వ్యాఖ్యానించారు. ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంతో సంబంధమున్న అమెరికాలో బ్రిటన్ రాయబారి పీటర్ మాండెల్సన్‌ను గతేడాది సెపె్టంబర్‌లో స్టార్మర్ తొలగించారు. మాండెల్సన్‌ను ఆ పదవికి ఎంపిక చేయడానికి తన సిఫార్సే కారణమని చింతిస్తూ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్ స్వీనీ ఆదివారం రాజీనామా చేశారు.
గోర్డన్ బ్రౌన్ ప్రధానిగా ఉన్న కాలంలో వాణిజ్య శాఖ మంత్రి హోదాలో మాండెల్సన్ బ్రిటన్ విధానపర నిర్ణయాలను ఎప్‌స్టీన్‌కు రహస్యంగా ముందే చేరవేసినట్లు ఎప్‌స్టీన్ పత్రాల్లో తాజాగా తేలింది. దీంతో కీలక పదవుల్లో సమర్థుల నియామకంలో ప్రధానిగా స్టార్మర్ ఘోరంగా విఫలమయ్యారని విపక్ష పారీ్టలతో పాటు సొంత లేబర్ పార్టీ ఎంపీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు ప్రధానిగా కొనసాగే అర్హత లేదని తిట్టిపోస్తున్నారు.
స్టార్మర్ రాజీనామా చేయాల్సిందే
ప్రధానిగా స్టార్మర్ తప్పుకోవాలని స్కాట్లాండ్‌లో లేబర్ పార్టీ నేత అనాస్ సర్వార్ డిమాండ్‌చేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ వంటి కీలక పదవుల నుంచే రాజీనామాల పర్వం మొదలవడంతో స్టార్మర్ వెంటనే నష్ట నివారణ చర్యలు ఆరంభించి కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మాండెల్సన్ నియామకంలో తప్పిదం చేశానని స్టార్మర్ క్షమాపణలు చెప్పినా విమర్శలు ఆగడం లేదు.
ఈ వారం జరగబోయే పార్లమెంటరీ లేబర్ పార్టీ సమావేశంలో స్టార్మర్ మరోసారి తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ ప్రాంతానికి చేరుకున్న కేబినెట్ మంత్రులు పలువురు స్టార్మర్‌కు మద్దతు పలకడం విశేషం. ‘‘ఆయన పదవిలోకి వచ్చి 18 నెలలే అవుతోంది. ఆయన పనిని సవ్యంగా చేయనిస్తాం’’అని విద్యా శాఖ మంత్రి బ్రిగ్జెడ్ ఫిలిప్సన్, హోం మంత్రి షబానా మహ్‌మూద్ అన్నారు.
తొలిసారిగా స్పందించిన రాజకుటుంబం
ఎప్‌స్టీన్ వ్యవహారానికి యూకే అధికార వర్గాలతో సంబంధం ఉండటంపై బ్రిటన్ రాజకుటుంబం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ నివసించే అధికారిక రాజప్రాసాదం ‘కెన్సింగ్టన్ ప్యాలెస్’సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది.‘‘యువరాజు కుటుంబం తాజా పరిణామాలపై చాలా మనస్తాపం చెందింది. అధికార వర్గాలతో సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడటం విస్మయం కల్గిస్తోంది.
ఈ పరిణామాలను విలియం, కేట్ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉదంతంలో ఆనాడు బాధితులుగా మిగిలిపోయిన అమాయక టీనేజర్లు, యువతుల పోరాటానికి రాజకుటుంబం తమ సంఘీభావం వ్యక్తం చేస్తోంది’’అని కెన్సింగ్టన్ ప్యాలెస్ పేర్కొంది. అయితే రాజు చార్లెస్–3కు తమ్ముడు, ఇటీవల రాజకుటుంబ హోదా వదలుకున్న ఆండ్రూపై విచారణ జరిపే విషయాన్ని ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎప్‌స్టీన్‌కు చెందిన ద్వీపాల్లోని విలాసవంత ఎస్టేట్‌లకు పలుమార్లు ఆండ్రూ వెళ్లినట్లు వెల్లడైన విషయం విదితమే.


