ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. ఎట్టకేలకు స్పందించిన బిల్‌గేట్స్‌ | Bill Gates Reacts On Epstein files Regrets and Apology | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. ఎట్టకేలకు స్పందించిన బిల్‌గేట్స్‌

Feb 5 2026 9:56 AM | Updated on Feb 5 2026 10:09 AM

Bill Gates Reacts On Epstein files Regrets and Apology

అమెరికాతో పాటు పలు దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వ్యవహారం ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎట్టకేలకు స్పందించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తాను టైం స్పెండ్‌ చేయడం పెద్ద తప్పైపోయిందని.. అందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నానని అన్నారాయన. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. 

ఆస్ట్రేలియా 9న్యూస్‌ చానెల్‌ చీఫ్‌ పొలిటికల్‌ ఎడిటర్‌ చార్లెస్‌ క్రౌచర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌ గేట్స్‌ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారంపై స్పందించారు. ‘‘2011లో తొలిసారి ఎప్‌స్టీన్‌ను కలిశా. అప్పటి నుంచి మూడు ఏళ్లపాటు కొన్ని విందు కార్యక్రమాల్లో మేం పాల్గొన్నాం అంతే. ప్రపంచవ్యాప్తంగా  ఉన్న ధనికుల నుంచి ‘గ్లోబల్‌ హెల్త్‌’ పేరిట విరాళాలు తెచ్చి పెడతానని అతను నాతో అన్నాడు. అది వృథా ప్రయత్నమని నేను అతనికి చెప్పాను. అతని దీవికి ఏనాడూ నేను వెళ్లింది లేదు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడిందీ లేదు. అతనితో గడిపిన ప్రతీ నిమిషం పట్ల నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. అందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నా అని బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించారు. 

అయితే.. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల తాలుకా మెయిల్స్‌, మరికొన్ని ఫొటోలు వెలుగులోకి రావడాన్ని బిల్‌గేట్స్‌ తోసిపుచ్చారు. ఎప్‌స్టీన్‌ రాసిన డ్రాఫ్ట్ ఈ-మెయిల్స్‌లో ఉన్న ఆరోపణలు అసత్యమని, ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ తాను పంపలేదని తెలిపారు. మరోవైపు.. బిల్‌గేట్స్‌ వ్యక్తిగత ప్రతినిధి సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. గేట్స్‌ తనతో స్నేహం కొనసాగించలేదన్న కోపంతోనే ఎప్‌స్టీన్‌ అలా డ్రాప్ట్‌ మెయిల్స్‌ను సృష్టించి ఉంటాడని తెలిపారు. 

జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్‌.. టీచర్‌, ప్రముఖ ఆర్థికవేత్త. అమెరికాలో పలు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు ఆర్థిక సలహాదారుడిగా పని చేశాడు. అలా.. క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పరిచయం పెంచుకున్నాడు. అతనికి సంబంధించిన ప్రైవేట్‌ దీవుల్లో మైనర్లతో హైఫ్రొఫైల్‌ సెక్స్‌ రాకెట్‌ నిర్వహించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎప్‌స్టీన్‌, అతనికి సహకరించిన వ్యక్తిగత సిబ్బంది గిస్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే అరెస్ట్‌ అయిన అదే ఏడాది(2019)లో ఎప్‌స్టీన్‌ జైల్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు(ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి). ఈ కేసులో ఎప్‌స్టీన్‌ ప్రైవేట్‌ ఐల్యాండ్‌ నుంచి సేకరించిన పలు వివరాలు.. సెక్స్‌రాకెట్‌లో పలువురు ప్రముఖులు ఉండడంతో ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌గా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో.. 

అమెరికా న్యాయ శాఖ (DOJ) తాజాగా రిలీజ్‌ చేసిన ఫైల్స్‌లో కొన్ని డ్రాఫ్ట్ ఈమెయిల్స్‌లో బిల్ గేట్స్ పేరు ప్రస్తావించబడింది. అందులో గేట్స్‌పై అనైతిక సంబంధాలు, రష్యన్‌ యువతుతో గడిపినందుకు సుఖ వ్యాధి (STD) సోకిందనే.. ఆరోపణలు వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. 

అయితే.. ఈ వ్యవహారంపై బిల్‌ గేట్స్‌ మాజీ సతీమణి మిలిండా గేట్స్‌ సైతం స్పందించడంతో చర్చ తీవ్రతరమైంది. మెలిండా, బిల్‌గేట్స్‌లు 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎప్‌స్టీన్‌తో బిల్‌ గేట్స్‌ సంబంధాలు కూడా తమ వైవాహిక జీవితంలో విబేధాలకు ఒక కారణమనే రీతిలో ఆమె స్పందించారు.  ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పై స్పందిస్తూ.. ఇవి నా వివాహ జీవితంలోని అత్యంత బాధాకరమైన కాలాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి అని అన్నారామె. అయితే.. సుఖ వ్యాధి అంశంపై స్పందిస్తూ.. ‘‘ఏ ప్రశ్నలు మిగిలి ఉన్నాయో, వాటికి సమాధానం చెప్పాల్సింది నా మాజీ భర్తే. నేను కాదు’’ అని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు.. 2022లో సీబీఎస్‌ మార్నింగ్స్‌ ఇంటర్వ్యూలో కూడా ఆమె.. బిల్ గేట్స్‌కు ఎప్‌స్టీన్‌తో ఉన్న పరిచయం తనకు అసౌకర్యం కలిగించిందని అన్నారు కూడా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement