30 లక్షల పేజీల పత్రాలు | US justice department releases 30 lakh new pages of Epstein files | Sakshi
Sakshi News home page

30 లక్షల పేజీల పత్రాలు

Feb 1 2026 4:32 AM | Updated on Feb 1 2026 4:32 AM

US justice department releases 30 lakh new pages of Epstein files

 2 వేల వీడియోలు, 1.80 లక్షల ఫొటోలు   

న్యూయార్క్‌:  అమెరికా కుబేరుడు, ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసింది. 30 లక్షల పేజీల పత్రాలతోపాటు 2 వేల వీడియోలు, 1.80 లక్షల ఫొటోలు బయటపెట్టడం గమనార్హం. పలువురు యువతులు, బాలికలపై ఎప్‌స్టీన్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 

అంతేకాకుండా డొనాల్డ్‌ ట్రంప్, బిల్‌ క్లింటన్‌ వంటి ప్రముఖులు, ధనవంతులతో ఎప్‌స్టీన్‌ జరిపిన సంభాషణలపైనా దర్యాప్తు జరిగింది. దర్యాప్తు వివరాలు, పత్రాలను చట్ట ప్రకారమే బహిర్గతం చేసినట్లు న్యాయశాఖ వెల్లడించింది. వీటిని శుక్రవారం తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఇందులో ఆండ్రూ మౌంట్‌బాటన్‌ విండ్సర్‌ (ప్రిన్స్‌ ఆండ్రూ), ఎలాన్‌ మస్క్‌ తదితర మిత్రులతోనూ ఎప్‌స్టీన్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈ–మెయిల్స్‌ ఇందులో ఉన్నాయి. 

ఎప్‌స్టీన్‌తోపాటు ఆయన ప్రియురాలు మాక్స్‌వెల్‌ నిర్వాకాలపై దర్యాప్తు వివరాలు బయటపెట్టాలని ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ట్రాన్స్‌పరెన్సీ చట్టాన్ని తీసుకొచ్చింది. న్యాయ శాఖ గత నెలలో పరిమితంగా కొన్ని పత్రాలు విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాజాగా మొత్తం ఫైళ్లు బయటపెట్టింది.  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎప్‌స్టీన్‌ బంధం చర్చనీయాంశంగా మారుతోంది. చాలామంది ప్రముఖులకు అమ్మాయిలను ఎరవేసి, తన పనులు పూర్తిచేసుకున్నట్లు ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే, అతడితో చాలా ఏళ్ల క్రితమే సంబంధాలు తెంచేసుకున్నానని ట్రంప్‌ ఇటీవల వివరణ ఇచ్చారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ 1953 జనవరి 20న న్యూయార్క్‌లో జన్మించాడు. లైంగిక వేధింపులకు సంబంధించి ఆయనపై పలు అభియోగాలు నమోదయ్యాయి. 18 ఏళ్లలోపు బాలికలను వేధించినట్లు నిరూపణ జరిగింది. 2019 ఆగస్టు 10 న్యూయార్క్‌ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   
 

Advertisement
 
Advertisement
Advertisement