ఉపగ్రహాలు ఢీకొట్టకుండా అప్రమత్తం చేయనున్న వ్యవస్థ
వేల ఉపగ్రహాల తాజా లొకేషన్ ఉచితంగా షేరింగ్
కొత్తగా అందుబాటులోకి తెచ్చిన స్పేస్‌ఎక్స్
ఇతరుల బాగు కోరే వారే మంచి మనిషి అని శతాబ్దాలుగా వింటున్నాం. ఇప్పుడీ మంచి పనిని అంతరిక్ష వేదిగా ఆచరించి చూపుతా మని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్’ సంస్థ శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో వందల కిలోమీటర్ల ఎత్తులో వేర్వేరు కక్ష్యల్లో తిరిగే కృత్రిమ ఉపగ్రహాలు హఠాత్తుగా స్థానచలనం చెందిన విపత్కర సందర్భాల్లో సమీప ఉపగ్రహాల ఆపరేటర్లను అప్రమత్తంచేసే అత్యాధునిక ఆన్‌లైన్ టూల్ ‘స్టార్‌గేజ్’ను అందుబాటులోకి తెచ్చినట్లుస్పేస్‌ఎక్స్ ప్రకటించింది. దీనిని స్పేస్ సిట్యూవేషనల్ అవేర్‌నెస్ సిస్టమ్ అని కూడా పిలుస్తున్నారు.
ఏమిటీ స్టార్‌గేజ్?
ఇదొక అప్రమత్త వ్యవస్థ. ఉపగ్రహాల ఇంధనం ఖాళీ అవడం, లేదా ఉపగ్రహం విఫలమై దిగువ కక్ష్యలోకి జారిపోవడం లేదా స్వేచ్ఛగా ఇష్టమొచ్చినట్లు తిరిగే సందర్భాల్లో అవి అంతరిక్ష బాంబుల్లా మారిపోతాయి. సమీప ఉపగ్రహాలకు ఢీకొట్టి సర్వనాశనం చేస్తాయి. తర్వాత ఇది శృంఖల చర్యలా విశృంఖలంగా జరిగి వందల ఉపగ్రహాలు ధ్వంసమయ్యే పెను ప్రమాదముంది. ఈ అంతరిక్ష ప్రమాదాన్ని మొగ్గదశలోనే తుంచేసే శక్తి ఈ స్టార్‌గేజ్‌కు ఉంది.
అస్తవ్యస్తంగా కదులుతున్న ఉపగ్రహాల జాడ, లొకేషన్‌ను ఇతర ఆపరేటర్లకు ఉచితంగా స్పేస్‌ఎక్స్ అందిస్తుంది. దాంతో తమ ఉపగ్రహాలను ఆ ప్రమాదకర ఉపగ్రహం నుంచి దూరంగా తీసుకెళ్లడమో, దిగువ కక్ష్యలోకి సురక్షితంగా మార్చడమో సాధ్యమవుతుంది. దీంతో ఉపగ్రహాల యాక్సిడెంట్‌ను నివారించవచ్చు. కేవలం ఉపగ్రహాలు మాత్రమేకాకుండా హఠాత్తుగా దూసుకొచ్చిన చిన్నపాటి గ్రహశకలాల లొకేషన్‌నూ ఆపరేటర్లకు స్టార్‌గేజ్ అందిస్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం ఇవ్వడం స్టార్‌గేజ్ ప్రత్యేకత. అత్యాధుని సెన్సార్లు, సంక్టిష్లమైన సాఫ్ట్‌వేర్ సాయంతో పాత ఉపగ్రహాల శకలాలనూ స్టార్‌గేజ్ గుర్తించి వాటి జాడను ఆపరేటర్లకు అందజేస్తుంది.
ఒకచోట పొగుబడిన శకలాల ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంచేస్తుంది. ఉపగ్రహాలు ఢీకొట్టే అవకాశాలు గణనీయంగా తగ్గించి తద్వారా అంతరిక్ష చెత్త పోగుబడకుండా, ఆ ప్రాంతంలో మరో కొత్త ఉపగ్రహం వచ్చి చేరేందుకు మార్గం సుగమం చేస్తుంది. పౌర, సౌనిక, నిఘా, వాతావరణ ఉపగ్రహాల ప్రయోగాలతో దిగువ భూకక్ష్యల్లో కొత్త ఉపగ్రహాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు వేలాది ఉపగ్రహాల కూటమి స్టార్‌లింక్‌తో ఉపగ్రహాల సంఖ్య వేలాదిగా ఎక్కువైంది. ఈ తరుణంలో అంతరిక్షం సైతం ఒక రద్దీ అయిన రహదారిలో మారింది. రోడ్డుపై వాహనాలను క్రమబద్ధీకరించే ట్రాఫిక్ కానిస్టేబుల్ తరహా వ్యవస్థ తక్షణావసరమైంది. ఈ అవసరాన్ని స్టార్‌గేజ్ తీర్చనుంది.
అదనంగా కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్..
ఇప్పుడున్న ఉపగ్రహాలు కొన్ని గంటల తర్వాత ఏ దిశగా ఎంత దూరం కదులుతాయి అనే వివరాలను స్టార్‌గేజ్ ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉపగ్రహాల ఆపరేటర్లకు ఉచితంగా అందివ్వనుంది. దీంతో తోటి ఉపగ్రహాలతోపాటు ఖగోళ వస్తువులు, స్పేస్ చెత్త ఎక్కడున్నాయో ఇట్టే తెల్సిపోతుంది. వీటికి అనుగు ణంగా ఆపరేటర్లు తమ భవిష్యత్ ఉ పగ్రహాల ప్రయోగాల తేదీలను సవరించుకోవ చ్చు. దీని వల్ల అత్యంత విలువైన సమయం, ప్రయోగాల ఖర్చు కలిసివస్తాయి. స్టార్‌గేజ్ అందించనున్న అత్యంత విలువైన డేటా షేరింగ్ సమాచారాన్ని నాసా, ఇతర అంతర్జాతీయ ఉపగ్రహ ఆపరేటర్లు ఎప్పట్నుంచో కోరుతుండగా ఇన్నేళ్లకు ఇది సాకారమైంది.
గత ఏడాది డిసెంబర్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ కూటమికి అత్యంత సమీపంగా చైనా ఉపగ్రహం దూసుకొచ్చింది. అవి ఢీకొట్టే పెనువినాశనం సంభవించేది. దీంతో భయపడిన స్టార్‌లింక్ ఏకంగా తమ 4,400 ఉపగ్రహాలను వెనువెంటనే 480 కిలోమీటర్ల దిగువ కక్ష్యలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దనే సదుద్దేశంతో ఉచితంగా ఈ సేవలను స్టార్‌లింక్ అంతర్జాతీయంగా అన్ని దేశాలకు అందుబాటులోకి తెచ్చింది. కంజంక్షన్ డేటా మెసేజెస్(సీడీఎం)లను ఎప్పటికప్పుడు స్టార్‌గేజ్ పంపనుంది. కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్ ద్వారా గంటల తర్వాత రావాల్సిన డేటాను కేవలం నిమిషాల్లోనే సీడీఎంల రూపంలో ఆపరేటర్లు పొందొచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్


