అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. తన పాపులర్ మోడల్స్ 'ఎస్, ఎక్స్' ఎలక్ట్రిక్ కార్లను దశలవారీగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. బదులుగా.. హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడానికి కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.
2012, 2015లో మార్కెట్లో విడుదలైన టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందాయి. స్టార్టప్ నుంచి టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా ఎదగడానికి ఇవి దోహదపడ్డాయి. అలాంటి కార్లను కంపెనీ నిలిపివేయడానికి సిద్ధమైంది. పెట్టుబడిదారులు & వాల్ స్ట్రీట్ విశ్లేషకులతో జరిగిన సమావేశం తరువాత మస్క్ ఈ ప్రకటన చేశారు.
టెస్లా కంపెనీ మోడల్ ఎస్, ఎక్స్ కార్లను నిలిపివేయడానికి ప్రధాన కారణం.. అమ్మకాలు బాగా తగ్గడమే. ఈ సమయంలో బీవైడీ వంటి కంపెనీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం చివరి మూడు నెలలకు టెస్లా తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసినప్పుడు కూడా కంపెనీ లాభాలు తగ్గినట్లు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఈ ఏడాది కూడా లాభాలు కనిపించలేదు. 2024 ఆదాయంతో పోలిస్తే 3% తగ్గినట్లు సంస్థ నివేదికలు చెబుతున్నాయి.


