సూపర్ కంప్యూటర్ల వలయాన్ని సృష్టించనున్న ఎలాన్‌మస్క్
అంతరిక్షం నుంచే నేరుగా ఏఐ సేవలు
అనుమతి కోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌కు దరఖాస్తు చేసిన స్పేస్‌ఎక్స్
ప్రైవేట్ అంతరిక్ష రంగం, కృత్రిమ మేధ రంగాలను అత్యంత వేగంగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ రంగం సిద్ధంచేస్తున్నారు. మానవాళి కృత్రిమ మేధ అవసరాలను వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచే నేరుగా తీర్చేందుకు ఏకంగా 10,00,000 ఏఐ సూపర్‌కంప్యూటర్లను నింగిలోకి పంపనున్నారు.
ఒక్కో కృత్రిమమేథ సూపర్‌కంప్యూటర్‌ను ఒక్కో ఉపగ్రహంతో అనుసంధానించి సేవలు అందించాలని మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తంగా 10 లక్షల ఏఐ సూపర్‌కంప్యూటర్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాలని స్పేస్‌ఎక్స్ నిర్ణయించింది. ప్రయోగాల కోసం అమెరికా ప్రభుత్వ అనుమతి కోరారు. అతిపెద్ద జల్లెడ మాదిరిగా శాటిలైట్లన్నీ ఒకదానితో మరోటి లేజర్ కాంతిపుంజంతో అనుసంధానమై ఉంటాయి.
తద్వారా ఉమ్మడిగా ఊహించనంత వేగంగా కృత్రిమ మేధ సేవలను అందించనున్నాయి. ఇన్నేసి సూపర్‌కంప్యూటర్లను భూమిపై సర్వర్‌ఫామ్‌లో ఏర్పాటుచేసి నిర్వహించాలంటే అత్యధిక స్థాయిలో విద్యుత్‌ను నిరంతరంగా సరఫరాచేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవడంతో సౌరశక్తిని ఉపయోగించుకుని ఆకాశంలోనే అతిపెద్ద సోలార్‌ప్యానెల్ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా 10 లక్షల ఏఐ కంప్యూటర్ల శక్తి అవసరాలు తీర్చనున్నారు.
1968లో వచ్చిన ‘2001: స్పేస్ ఒడిస్సీ’హాలీవుడ్ చిత్రంలో ‘హాల్ 9000’కృత్రిమమేధావి చేసే ప్రయోగాలు ఇన్నాళ్లూ సినిమాలకే పరిమితంకాగా ఇకపై వాటిని నిజజీవితంలోకి తీసుకొస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఏఐ కంప్యూటర్ల దండును నింగిలో మోహరింపజేసి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగదారుల కృత్రిమమేధ అవసరాలు తీర్చబోతున్నామని మస్క్ వివరించారు. ఈ వ్యవస్థకు ‘ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్’అని పేరు పెట్టారు.
ఇది అందుబాటులోకి వస్తే భూమిపై వినియోగదారులకు సంబంధించిన విపరీతమైన సమాచారం, సంక్లిష్టమైన డేటాను అత్యధిక వేగంతో ప్రాసెస్ చేయడమూ సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఏఐ మోడళ్లను పరీక్షించి అందుబాటులోకి తేవచ్చు. భూమి నుంచి 500 నుంచి 2,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఒకదానితో మరోటి ఢీకొట్టకుండా వీలైనంత దూరంలో కక్ష్యలో స్థిరపరచనున్నారు.
‘‘ఊహించనంతగా వచ్చి పడుతున్న ఏఐ డిమాండ్‌ను అందుకోవాలంటే భూమి మీద సౌకర్యాల విస్తరణతో సాధ్యంకాదు. అంతరిక్షంలో కక్ష్యల్లో కొలువుతీరిన లక్షలాది ఉపగ్రహాలతోనే ఇది సాధ్యం. పుష్కలంగా లభించే సౌరశక్తిని ఒడిసిపట్టి ఈ సూపర్‌కంప్యూటర్ల విద్యుత్‌శక్తి అవసరాలు తీర్చుతాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా కేంద్రంగా అంతరిక్షాన్ని సిద్ధంచేయబోతున్నాం’’అని మస్క్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు.
స్టార్‌లింక్ స్ఫూర్తితో..
ఇప్పటికే వేలాది కృత్రిమ ఉపగ్రహాలతో మస్క్ కు చెందిన స్టార్‌లింక్ సంస్థ విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీని స్ఫూర్తితోనే ఏఐ సేవలు అందించేందుకు ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన పనులు మొదలెట్టారు. ఇందుకోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(యూఎస్‌ఎఫ్‌సీసీ) వద్ద స్పేస్‌ఎక్స్ దరఖాస్తు చేసుకుంది.
భూమిపై ఏర్పాటుచేసిన డేటా సెంటర్లు పవర్ గ్రిడ్‌లతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్ అంతరాయం పెద్ద అవరోధంగా తయారైంది. అతిపెద్ద సర్వర్‌ఫామ్‌ల ఏర్పాటుకు భూమి సేకరణ ఇబ్బందిగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భూమి సేకరణ అనేది ఖరీదైన వ్యవహారంగా తయారైంది. విద్యుత్ తయారీకి బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను వినియోగిస్తారు. దీంతో ఇంతపెద్ద ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడమూ కష్టమే.
ఈ సమస్యలేవీ అంతరిక్షంలో ఉండవు. ఆ కారణంతోనూ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు నింగిని వేదికగా ఎంపికచేశారు. భూమి మీద ఏఐ సూపర్‌కంప్యూటర్లను చల్లబరిచేందుకు కూలింగ్ వ్యవస్థలు అవసరం. అదే అంతరిక్షంలో శూన్యం ఉంటుందికాబట్టి ఇది సహజ రిఫ్రిజిరేటర్‌గా పనిచేస్తుంది. రాత్రిళ్లు అత్యల్ప ఉష్ణోగ్రతలకు ఏఐ వ్యవస్థ ఆటోమేటిక్‌గా చల్లబడుతుంది.
విద్యుత్ అవసరం కూడా ఉండదు. 10 లక్షల ఉపగ్రహాల మధ్య సమాచారాన్ని హైస్పీడ్ లేజర్ కాంతిపుంజం రూపంలో బదిలీచేస్తారు. దీంతో ట్రిలియన్ల బైట్ల డేటా వేగంగా సరఫరా అవుతుంది. ఈ వ్యవస్థ మొత్తం ఆకాశంలో ఏర్పాటయ్యాక ప్రతి టన్ను సౌరఫలకాల వ్యవస్థ నుంచి ఏకంగా 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీంతో అక్కడి డేటా సెంటర్ల శక్తి అవసరాలు సైతం తీరనున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


