పెన్నీ.. విన్నర్‌ | Penny the Doberman wins best in show at 150th Westminster Show | Sakshi
Sakshi News home page

పెన్నీ.. విన్నర్‌

Feb 5 2026 6:35 AM | Updated on Feb 5 2026 12:13 PM

Penny the Doberman wins best in show at 150th Westminster Show

న్యూయార్క్‌: అమెరికాలో పెంపుడు శునకాల క్రమ శిక్షణ, అద్భుత నైపుణ్యాల ప్రదర్శనకు పెట్టింది పేరైన వెస్ట్‌మినిస్టర్‌ షోలో నాలు గేళ్ల నలుపు డామర్‌మాన్‌ శునకం ‘పెన్నీ’ విజేతగా నిలబడి అందరి మదినీ దోచేసింది. దీని వయసు కేవలం నాలుగేళ్లే. బెస్ట్‌ ఇన్‌ షో టైటిల్‌ నెగ్గడంతో దీని పెంపకందారు పెద్దాయన యాండీ లిన్టన్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత పెన్నీ ద్వారా తనకు గుర్తింపు దక్కిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. 200 జాతులకు చెందిన మొత్తం 2,500 శునకాల నుంచి గట్టి పోటీ ఎదురైనాసరే పెన్నీ తన ఆట నైపుణ్యం, తెలివితేటలతో విజయకేతనం ఎగురవేసింది.

 ‘‘నాకింకా ఎన్నో విజయాలను వరించాలని ఉంది. కానీ ఈ 150వ వెస్ట్‌మినిస్టర్‌ కెన్నెల్‌ క్లబ్‌ డాగ్‌ షోను గెలవడం ఎంతో ప్రత్యేకం. పెన్నీ నిజంగా ఎంతో మంచి డాబర్‌మాన్‌. ఇలాంటి శునకాన్ని ఎన్నడూ చూడలేదు’’ అని యాండీ లిన్టన్‌ అన్నారు. ఈసారి విజేతలు చరిత్రలో నిలిచిపోతారని పోటీలకు న్యాయమూర్తి డేవిడ్‌ ఫిజ్‌ప్యాట్రిక్‌ వ్యాఖ్యానించారు. పెన్నీ గత ఏడాదిసైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేత శునకాలలకు ట్రోఫీతోపాటు రిబ్బన్, బ్రాగింగ్‌ హక్కులను కల్పిస్తారు. బ్రాగింగ్‌ రైట్స్‌తో శునకాల సంరక్షకులు వాటి పెంపకానికి అత్యధిక ఫీజులు వసూలుచేస్తారు. శునకం జాతికీ సమాజంలో అత్యధిక విలువ దక్కుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement