‘వాషింగ్టన్ పోస్ట్‌’ షాక్‌.. 300 మంది ఉద్యోగుల తొలగింపు | Shashi Tharoor's son Ishaan laid off by Washington Post | Sakshi
Sakshi News home page

‘వాషింగ్టన్ పోస్ట్‌’ షాక్‌.. 300 మంది ఉద్యోగుల తొలగింపు

Feb 5 2026 9:08 AM | Updated on Feb 5 2026 9:34 AM

Shashi Tharoor's son Ishaan laid off by Washington Post

వాషింగ్టన్: ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తాజాగా భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మూడో వంతు సిబ్బందిని (300 మందికి పైగా) ఇంటికి పంపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన పత్రికగా  ‘వాషింగ్టన్ పోస్ట్’కు పేరు ఉంది. సంస్థ  తన స్పోర్ట్స్ విభాగాన్ని పూర్తిగా మూసివేయడంతో పాటు, అనేక విదేశీ బ్యూరోలను, పుస్తక సమీక్షల విభాగాన్ని కూడా రద్దు చేసింది. టెక్నాలజీలో మార్పులు, పాఠకుల అలవాట్లకు అనుగుణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మాట్ ముర్రే పేర్కొన్నారు. ఈ లేఆఫ్స్‌లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కుమారుడు, అంతర్జాతీయ కాలమిస్ట్ ఇషాన్ థరూర్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయారు. 

సుమారు 12 ఏళ్లుగా ‘వాషింగ్టన్ పోస్ట్’లో పనిచేస్తున్న ఇషాన్ థరూర్ తన నిష్క్రమణపై సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రోజు వాషింగ్టన్ పోస్ట్ నుండి నాతో పాటు అనేకమంది అంతర్జాతీయ సిబ్బందిని తొలగించారు. మా న్యూస్‌రూమ్, ముఖ్యంగా విదేశాల్లో అద్భుతమైన సేవలు అందించిన నా సహచరుల కోసం నా హృదయం ద్రవిస్తోంది’ అని ఇషాన్ పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న న్యూస్‌రూమ్ ఫోటోను షేర్ చేస్తూ, ఇది తన జీవితంలో ఒక చెడ్డ రోజు అని ఆయన అభివర్ణించారు.

వాషింగ్టన్ పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌పై కూడా ప్రభావం చూపింది. న్యూఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రాన్షు వర్మను సంస్థ తొలగించింది. ఆయనతో పాటు మిడిల్ ఈస్ట్ రిపోర్టింగ్ టీమ్, ఉక్రెయిన్, జెరూసలేం బ్యూరోలను కూడా మూసివేసినట్లు సమాచారం. 2017లో తాను ప్రారంభించిన 'వరల్డ్ వ్యూ' కాలమ్‌ను ఆదరించిన లక్షలాది మంది చందాదారులకు ఇషాన్ థరూర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

వాషింగ్టన్ పోస్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మార్టిన్ బారన్ స్పందిస్తూ.. ఇది సంస్థ  బ్రాండ్ ఇమేజ్‌ను స్వయంగా దెబ్బతీసుకోవడమేనని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో పట్టున్న డెస్కులను, స్పోర్ట్స్, కల్చర్ విభాగాలను మూసివేయడం కారణంగా పత్రిక ప్రాభవం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక కారణాలతోనే కాకుండా, కొన్ని సైద్ధాంతిక మార్పుల వల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నారని మరికొందరు జర్నలిస్టులు విమర్శిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement