తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమావేశాన్ని డుమ్మా కొట్టి.. కేరళలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. అది కూడా మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉండటం మరోసారి అనుమానాలను పెంచింది.
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక వ్యూహాత్మక సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి సీనియర్ నేత శశిథరూర్ హాజరుకాలేదు. ఆయన నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఆయన కార్యాలయం స్పందిస్తూ.. కొలికోడ్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్ట్‌లో పాల్గొనేందుకే థరూర్ రాష్ట్రంలో ఉన్నారని తెలిపింది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో సీనియర్ నేత, నాలుగుసార్లు ఎంపీగా ఉన్న థరూర్.. ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం ఆ పార్టీని ఇబ్బందికి గురిచేస్తోంది. దీంతో రాష్ట్ర నాయకులు కూడా పార్టీ వ్యవహారాల్లో ఆయన్ను పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొచ్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తనతో సరిగా వ్యవహరించకపోవడంపై థరూర్ తీవ్ర కలత చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన అధిష్ఠానం దృష్టికీ తీసుకెళ్లినట్లు తెలిసింది.


