అమెజాన్‌ ఉద్యోగులకు అమావాస్యే! కత్తులు సిద్ధం!! | Reports Says Amazon Plans To Lay Off 14000 Employees By Next Week, Impacting AWS, Retail And Prime Video | Sakshi
Sakshi News home page

Amazon Layoffs: అమెజాన్‌ ఉద్యోగులకు అమావాస్యే! కత్తులు సిద్ధం!!

Jan 23 2026 11:17 AM | Updated on Jan 23 2026 11:35 AM

Amazon Plans To Lay Off 14000 Employees By Next Week Report

అమెజాన్‌లో వేలాది ఉద్యోగులు ఉద్వాసనకు దగ్గరయ్యారు. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ ఉటంకించిన వర్గాల సమాచారం ప్రకారం.. అమెజాన్ వచ్చే వారం ప్రారంభంలో మరోసారి కార్పొరేట్ ఉద్యోగ కోతలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించడం, నిర్వహణలో అధిక పొరలను తొలగించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

గతేడాది అక్టోబర్‌లో సుమారు 14 వేల ఉద్యోగాలను తొలగించిన తర్వాత ఇప్పుడు కూడా మరో 14 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగింపు అమెజాన్‌ సిద్ధమైంది. ఈ రెండు రౌండ్లలో మొత్తంగా 30 వేల మందిని తొలగించాలన్నది అమెజాన్‌ టార్గట్‌ అని రాయిటర్స్ ఇప్పటికే నివేదించింది. తాజా రౌండ్ లేఆఫ్‌ల ప్రక్రియ మంగళవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రభావితమయ్యే విభాగాలు
రాయిటర్స్ సమాచారం ప్రకారం.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, ప్రైమ్ వీడియో, మానవ వనరులు (People Experience and Technology) విభాగాలలో ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే ఉద్యోగ కోతల ఖచ్చితమైన సంఖ్య మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. గత అక్టోబర్‌లో కోతలను అమలు చేయాలా లేదా 2026 ప్రారంభానికి వాయిదా వేయాలా అనే స్వేచ్ఛను అమెజాన్ మేనేజర్లకు ముందుగానే ఇచ్చింది. దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని కోతలకు అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి.

పూర్తిగా అమలైతే, ఈ తొలగింపులు అమెజాన్ కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10% వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం అమెజాన్‌కు సుమారు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో మొత్తం 15.7–15.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో ఎక్కువ మంది గిడ్డంగులు, ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల్లో ఉన్నారు.

గతంలోనూ భారీ కోతలు
2022 చివరి భాగం నుంచి 2023 ప్రారంభం వరకు అమెజాన్ సుమారు 27,000 ఉద్యోగాలను తొలగించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతలలో ఒకటిగా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో తొలగింపులకు గురైన ఉద్యోగులకు ఇతర అంతర్గత పాత్రలు లేదా కొత్త అవకాశాలు వెతుక్కునేందుకు 90 రోజుల పేరోల్ గ్యారెంటీ ఇచ్చినట్లు రాయిటర్స్ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement