గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టనుందా? | Asteroid 2024 YR4 Could Hit the Moon | Sakshi
Sakshi News home page

గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టనుందా?

Feb 9 2026 4:10 PM | Updated on Feb 9 2026 4:18 PM

Asteroid 2024 YR4 Could Hit the Moon

ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక గ్రహశకలాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. దాని పేరు-2024 YR4. మరి ఇంత జాగ్రత్తగా శాస్త్రవేత్తలు ఎందుకు గమనిస్తున్నారు? అంటే..ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందా?ఉంటే.. ఒక వేళ అలా జరిగితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? భూమికి ఏమైనా ప్రమాదమా? ఇప్పుడిదే చర్చ ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తల మధ్య జరుగుతోంది.

శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం, 2024 YR4 అనే ఈ ఆస్టరాయిడ్ చంద్రుడిని ఢీకొట్టే అవకాశం సుమారు 4 శాతం ఉందని చెబుతున్నారు. 4 శాతం అంటే చిన్న సంఖ్యలా అనిపించొచ్చు… కానీ అంతరిక్ష లెక్కల్లో ఇది గమనించాల్సిన స్థాయి. సింగువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం ..ఒకవేళ ఇది నిజంగా చంద్రుడిని ఢీకొట్టితే? చంద్రునిపై భారీ విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంది.

ఈ విస్ఫోటనం ఎలా ఉంటుందంటే .హిరోషిమాపై పడిన అణుబాంబు శక్తికి 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో చంద్రుడిపై సుమారు ఒక కిలోమీటరు వ్యాసార్థంలో భారీ గొయ్యి ఏర్పడుతుంది. చంద్రుడి ఉపరితలం రెక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో కంపించవచ్చని చెబుతున్నారు. ఇక్కడి వరకు వినగానే… “అది చంద్రుడిపై కదా, మనకు ఏముంది?” అనిపించొచ్చు. కానీ అసలు ఆందోళన అక్కడే మొదలవుతోంది. ఈ విస్ఫోటనం వల్ల ఎగసి పడే దుమ్ము, శకలాలు భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాటిలో కొన్ని భూమి వాతావరణంలోకి ప్రవేశించి ఉల్కలుగా పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉల్కాపాతం కనిపించవచ్చు. మరికొన్ని చోట్ల అవి నిర్మాణాలను ఢీకొని ఆస్తి నష్టం కలిగించవచ్చు. ఇంకా పెద్ద ఆందోళన ఏంటంటే ..ఈ శకలాలు భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్‌ను ఢీకొట్టే అవకాశం. ఒక వేళ అలా జరిగితే…కమ్యూనికేషన్ వ్యవస్థలు, GPS, నావిగేషన్ సిస్టమ్స్, బ్యాంకింగ్ నెట్‌వర్క్స్ ..ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ గ్రహశకలం గమనంపై నిశితంగా నిఘా పెట్టాయి.

NASA, ESAతో పాటు ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా దీని ట్రాజెక్టరీని క్షణక్షణం ట్రాక్ చేస్తున్నాయి. అయితే… ఇప్పటికీ ఇది కేవలం సంభావ్యత మాత్రమే. ఖచ్చితంగా ఢీకొడుతుందని ఎవరూ చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం గా తెలుస్తోంది..మన ఆకాశం ప్రశాంతంగా కనిపించినా.. అక్కడ జరిగే ప్రతి కదలికను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement