వాషింగ్టన్ డీసీ: హెచ్-1బీ వీసాల అమలులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హెచ్-1బీ వీసాలను రద్దు చేయాలని అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ ఎంపీ స్టూబ్ బిల్లును ప్రవేశ పెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికాకు నష్టమన్న స్టూబ్.. అమెరికా యువతకు ఉద్యోగాలు రావడం లేదని వాదించారు.
అమెరికా కాంగ్రెస్‌లో ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్ట్యూబ్ ఒక సంచలనాత్మక బిల్లు ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు పేరు Ending Exploitative Imported Labour Exemptions Act (EXILE Act). దీని ద్వారా అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు.
‘విదేశీ కార్మికులను ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అమెరికా పౌరుల సంక్షేమం, అభివృద్ధి దెబ్బతింటోంది. ఇది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం’అని అన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ కారణంగా అమెరికా యువత, కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. మన పిల్లలకు అమెరికన్ డ్రీమ్‌ను కాపాడాలంటే విదేశీయులకు పెద్దపీఠ వేయకూడదని స్పష్టం చేశారు.
అదే సమయంలో గ్రెగ్ స్ట్యూబ్ బిల్లులో హెచ్-1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికా కార్మికులు ఎలా నష్టపోయారో ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణకు, 2015లో డిస్నీ 250 మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో విదేశీ కార్మికులను హెచ్-1బీ వీసా ద్వారా తీసుకువచ్చింది. 2014లో సదర్న్ కాలిఫోర్నియా ఎడిసన్ 540 మంది ఉద్యోగులను తొలగించి, భారతీయ ఔట్‌సోర్సింగ్ కంపెనీల ద్వారా వచ్చిన కార్మికులను నియమించింది. మైక్రోసాఫ్ట్‌లో 16,000 మంది ఉద్యోగులు తొలగింపులకు గురి కాగా.. ఆ సమయంలో 9వేల హెచ్-1బీ వీసాలు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు.
ఈ బిల్లుతో అమెరికాలోని ఐటీ రంగం, ముఖ్యంగా భారతీయ వృత్తిపరులు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్-1బీ వీసాలు లేకుండా అమెరికాలో ఉద్యోగాలు పొందడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే భారతదేశంలో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతున్నాయి. వీసా స్టాంపింగ్ కోసం వెళ్లిన అనేక మంది భారతీయులు అమెరికాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.


