వాషింగ్టన్: అమెరికాలో వరుస సాంకేతిక సమస్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన అంతరాయం మరువకముందే దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో, యూఎస్ బ్యాంక్‌తో పాటు డిజిటల్ చెల్లింపుల సంస్థ జెల్లే వినియోగదారులు సోమవారం లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జేపీ మోర్గాన్ చేజ్ అంతర్గత హార్డ్‌వేర్ వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా లావాదేవీలు ఆలస్యమయ్యాయి. చేజ్ ద్వారా ఇతర బ్యాంకులతో లావాదేవీలు జరిపే ఖాతాదారులపైనా ప్రభావం పడింది. అయితే ఇది సైబర్ దాడి కాదని బ్యాంకు స్పష్టం చేసింది. ఖాతాల్లోని డబ్బును వినియోగించుకునే అవకాశం ఉందని, కొన్ని సేవలు మాత్రం తాత్కాలికంగా అందుబాటులో లేవని తెలిపింది. మరోవైపు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నెట్‌వర్క్‌లోనూ సోమవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
హ్యూస్టన్‌లో ఓ పైలట్ తమ వ్యవస్థ తిరిగి పనిచేసే వరకు విమానాన్ని గేటు వద్దే ఉంచేందుకు అనుమతి కోరినట్లు రికార్డింగ్‌లో వెల్లడైంది. కొన్ని గంటల్లోనే ఎయిర్‌లైన్స్ వ్యవస్థను పునరుద్ధరించారు. అంతకుముందు శుక్రవారం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) నెట్‌వర్క్‌లో సమస్యతో దేశవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పాత కాపర్ వైర్ల స్థానంలో ఫైబర్ వైర్లు అమర్చే సమయంలో సమస్య మొదలైందని అధికారులు తెలిపారు.
అధిక డేటా ప్రవాహంతో విమానాల కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా విమాన నియంత్రణ వ్యవస్థ ఆధునికీకరణకు ట్రంప్ ప్రభుత్వం 50 బిలియన్ డాలర్లు కోరుతోంది. పాత వ్యవస్థను పూర్తిగా మార్చాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే ఎఫ్‌ఏఏ ఆధునికీకరణకు నిధులు కేటాయించామని, వాటిలో చాలావరకు ఖర్చు కాలేదని డెమోక్రటిక్ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆమోదించిన నిధులను 2028 చివరి నాటికి ఖర్చు చేస్తామని రవాణా మంత్రి సీన్ డఫీ తెలిపారు.
ఇదీ చదవండి: చైనా ఏఐ కలలపై ట్రంప్ ఉక్కుపాదం!


