అమెరికా విద్యపై తగ్గుతున్న క్రేజ్
2025–26లో 6.5 శాతం తగ్గిన భారతీయ విద్యార్థులు
మొత్తంగా విదేశీ విద్యార్థులు 2.7 శాతం తగ్గుదల
ఓపెన్ డోర్స్ నివేదిక
సాక్షి, అమరావతి: అమెరికాలో ఉన్నత విద్యపై క్రేజ్ తగ్గుతోందా? అంటే అవుననే చెబుతోంది ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక. అమెరికాలోని ప్రభుత్వేతర సంస్థ అయిన ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ)కి చెందిన ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం తాజా నివేదిక విడుదల చేసింది. 2025–26లో అమెరికా విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విదేశీ విద్యార్థులు 2.7% తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.
అందుకు వీసా నిబంధనలు కఠినతరం చేయడం, విదేశీ విద్యార్థులపై ఆంక్షలు పెరగడం, స్క్రూటినీ ప్రక్రియను సంక్లిష్టంగా మార్చడంతోపాటు విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగ అవకాశాలపై స్పష్టత లేకపోవడం ప్రధాన కారణాలని పేర్కొంది. మూడేళ్ల తరువాత అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో భారతీయ విద్యార్థుల చేరిక తొలిసారిగా తగ్గిందని నివేదికలో పేర్కొంది.
భారత్‌తోపాటు చైనా విద్యార్థుల్లో కూడా అమెరికాలో విద్య పట్ల ఈ ఏడాది ఆసక్తి కాస్త తగ్గినట్లు వెల్లడించింది. భారత్, చైనా విద్యార్థులు కలిపి అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 52% మంది ఉన్నట్లు వెల్లడించింది. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కంటే గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలిపింది.

నివేదికలో పేర్కొన్నఇతర ప్రధాన అంశాలు ఇవీ..
⇒ అర్హులైన విదేశీ విద్యార్థులకు అమెరికాలో ప్రాక్టికల్ ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉద్దేశించిన ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’(ఓపీటీ)లో పాలుపంచుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య మాత్రం 14.1% పెరగడం గమనార్హం. 2025–26లో 3,35,785 మంది విదేశీ విద్యార్థులు ఓపీటీలో ఎన్‌రోల్ చేసుకున్నారు. ఓపీటీలో భారతీయ విద్యార్థులు 26.8% పెరగడం విశేషం. 1,82,201 మంది ఓపీటీలో ఎన్‌రోల్ చేసుకున్నారు.
⇒అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విదేశీ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ కోర్సులకే అధిక ప్రాధాన్యమిచ్చారు. మొత్తం 2,86,168 మంది విద్యార్థులు ఈ కోర్సుల్లోనే ప్రవేశాలు పొందారు. కాగా, ఈ కోర్సుల్లో కూడా 2024–25తో పోలిస్తే 2025–26లో 6.3% మంది విద్యార్థులు తగ్గారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో 1.3% మంది విద్యార్థులు తగ్గి 2,14,193 మంది ప్రవేశాలు పొందారు. మేనేజ్మెంట్ కోర్సుల్లో 0.1%మంది విద్యార్థులు తగ్గి 1,60,009 మంది చేరారు. ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్– హెల్త్ కోర్సుల్లో మాత్రం విదేశీ విద్యార్థుల ప్రవేశాలు 2.8% పెరగడం గమనార్హం.
⇒ అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ కోర్సులు చేసేందుకు 17,250 మంది ప్రవేశాలు పొందారు.


