కృత్రిమ కొరత సృష్టించి దోచుకుంటున్న పచ్చ మిల్లర్లు
ఐదు నెలల్లోనే ఆకాశాన్నంటిన బియ్యం ధరలు
కిలో సన్నబియ్యం రూ.97.. 26 కిలోల బస్తా రూ.2,500 పైనే
బియ్యం మాఫియా నుంచి చినబాబు, నాదెండ్ల సహా ప్రజాప్రతినిధులకు ముడుపులు
డిమాండ్ ఉన్న బ్రాండ్ల మిల్లుల నుంచి ఒక్కోదాని ద్వారా రూ.100 కోట్లకుపైగా దోపిడీ
టీడీపీ నేతలు, వారి బంధువుల చేతుల్లోనే సన్నబియ్యం వ్యాపారం
చక్రం తిప్పుతున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల వియ్యంకుడు పట్టాభి, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
రేషన్ బియ్యానికి పాలిష్.. సన్నబియ్యం పేరుతో మార్కెట్‌లో విక్రయాలు
రైతుబజార్లలోనూ నాణ్యతకు తిలోదకాలు.. 25% వరకు నూకలు
విజిలెన్స్ తనిఖీలు శూన్యం.. మిల్లర్లపై చర్యలు కరువు
జగన్ హయాంలో మిల్లుల వద్దే ధరల పట్టికలు.. ఇప్పుడు నియంత్రణ గాలికి..
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యుడి అన్నంముద్దపైనా ‘పచ్చ మాఫియా’ పడగ విప్పింది. ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో కరువును బూచిగా చూపి తిండిగింజలపైనా దోపిడీకి తెగబడుతోంది. ఒకవైపు సన్నబియ్యం ధరలను ఆకాశానికెత్తి ప్రజల జేబులు గుల్ల చేస్తుంటే.. మరోవైపు రేషన్ బియ్యాన్నే పాలిష్ చేసి సన్నబియ్యం పేరుతో అధిక ధరలకు అంటగడుతోంది. నాసిరకం బియ్యంలో నూకలు కలిపి నాణ్యమైన బియ్యంగా చలామణి చేస్తూ నిలువుదోపిడీ సాగిస్తోంది.
ఈ దందా వెనుక ‘నీకింత.. నాకింత’ అన్నట్టుగా ప్రతి బస్తాలోనూ వాటాలు పంచుకుంటున్నారు. మంత్రులు చినబాబు, నాదెండ్ల మనోహర్ సహా స్థానిక ప్రజాప్రతినిధులకు బియ్యం మాఫియా నుంచి రోజువారీ ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో గిరాకీ ఉన్న బ్రాండ్ల బియ్యం ఉత్పత్తి చేసే ఒక్కో రైస్‌మిల్లు నుంచే రూ.100 కోట్లకుపైగా దోపిడీకి పాల్పడుతున్నారన్న చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ పెద్దల హస్తం ఉండబట్టే బియ్యం మాఫియాపై కొరడా ఝళిపించాల్సిన పౌరసరఫరాలు, విజిలెన్స్ విభాగాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. ప్రజల కడుపు కొడుతున్న మాఫియాకు అండగా నిలుస్తున్న చంద్రబాబు సర్కారుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జేబులు కొల్లగొడుతున్న ఈ దోపిడీ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలంటూ నిలదీస్తున్నారు.
కృత్రిమ కొరతతో రూ.కోట్ల దోపిడీ
రాష్ట్రంలో ఏటా 60–65 లక్షల టన్నుల బియ్యం వినియోగమవుతోంది. ఇందులో సాధారణ గృహ వినియోగమే 40 లక్షల టన్నులకుపైగా ఉంటుంది. పౌరసరఫరాల విభాగం (పీడీఎస్) ద్వారా ఏటా 28 లక్షల టన్నుల బియ్యం పంపిణీ అవుతోంది. అయితే ఇందులో మూడొంతులకుపైగా బియ్యాన్ని తిరిగి పాలిష్ చేసి బ్రాండెడ్ పేర్లతో రిటైల్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో బీపీటీ, సోనా మసూరి, హెచ్‌ఎంటీ వంటి సూపర్‌ఫైన్ రకాల బియ్యానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇదే అదనుగా మిల్లర్లు ధరల దందాకు తెరతీశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను సాకుగా చూపుతూ మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. ఫలితంగా నిత్యావసరమైన బియ్యం కొనుగోలు కూడా సామాన్య కుటుంబాలకు భారంగా మారుతోంది.
టీడీపీ నేతల గుప్పెట్లో సన్నబియ్యం మార్కెట్
రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్), నాన్ కస్టమ్ మిల్లింగ్ రైస్ (ఎన్‌సీఎంఆర్) కలిపి 2 వేలకుపైగా రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో సన్నబియ్యం ఉత్పత్తి, మార్కెటింగ్‌లో కీలకంగా ఉన్న మిల్లుల నిర్వాహకుల్లో అత్యధికులు టీడీపీకి చెందినవారే. మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న లలిత, కళ్యాణి, లేపాక్షి, లోహిత, 777 వంటి బ్రాండ్ల వెనుక ఉన్న వ్యాపారవేత్తల రాజకీయ సంబంధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కళ్యాణి బ్రాండ్ బియ్యం ఉత్పత్తిదారు మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కాగా.. లోహిత బ్రాండ్ ఉత్పత్తిదారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు పట్టాభి. శ్రీనివాస్ (లలిత), సూరిబాబు (లేపాక్షి), మురళీకృష్ణ ట్రేడర్స్ (777) వంటి సంస్థలు సన్నబియ్యం ఉత్పత్తి, మార్కెటింగ్‌లో కీలకంగా ఉన్నాయి.
ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మిల్లులపై పట్టాభి, ఎమ్మెల్యే జోగేశ్వరరావుల ప్రభావం ఉందని, ఈ నెట్‌వర్క్ ద్వారా ధరల దందా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలకు సన్నిహితులైన వ్యాపారవేత్తల చేతుల్లో కీలకమైన బియ్యం మార్కెట్ ఉండటం వల్ల నియంత్రణ వ్యవస్థలు మౌనంగా ఉన్నాయని అనుకోవలసి వస్తోంది.
ప్రభుత్వ పెద్దల అండతో ధరల దందా
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం ధరలు భారీగా పెరిగాయి. 2024 ఏప్రిల్‌లో రిటైల్ మార్కెట్‌లో కిలో సన్నబియ్యం ధర రూ.40–50 మధ్య ఉండేది. 26 కిలోల బస్తా రూ.1,100–1,200కే లభించేది. ఐదు నెలల క్రితం వరకు కిలో ధర సుమారు రూ.60 ఉండగా.. ప్రస్తుతం రూ.97కు చేరింది. 26 కిలోల బస్తా ధర రూ.2,500 దాటింది. మార్కెట్‌లోకి వస్తున్న బియ్యం గత ఖరీఫ్ సీజన్‌కు చెందినవే. గత ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడులు వచ్చినట్లు ప్రభుత్వమే ప్రకటించింది.
అయినప్పటికీ బియ్యం ధరలు ఇంతలా పెరగడానికి కారణమేంటి? దిగుబడులు సమృద్ధిగా ఉన్నప్పుడు కొరత ఎలా ఏర్పడింది? మిల్లర్లు నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? బియ్యం మాఫియా నుంచి మంత్రులు చినబాబు, నాదెండ్ల మనోహర్ సహా స్థానిక ప్రజాప్రతినిధులకు రోజువారీ ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. డిమాండ్ ఉన్న ఒక్కో బ్రాండ్ మిల్లులో రూ.100 కోట్లకుపైగా దోపిడీ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి బియ్యం బస్తాలోనూ వాటాలు పంచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం విచారణకు ముందుకు రావడం లేదు.
రేషన్ బియ్యానికే పాలిష్.. సన్నబియ్యంగా విక్రయం
బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదన్నట్టుగా వ్యవహరిస్తూ మిల్లర్ల దోపిడీకి పరోక్షంగా సహకరిస్తోంది. అదే సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు రైతుబజార్లలో కిలో రూ.50కే సన్నబియ్యం అంటూ ప్రచారానికి తెరతీసింది. గతంలో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పుడు అదే బియ్యాన్ని పాలిష్ చేసి స్థానిక మార్కెట్‌లో సన్నబియ్యంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ వ్యాపారంలో ప్రభుత్వమే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. రైతుబజార్లలో విక్రయించే బియ్యంలో 1010 వంటి దొడ్డు రకాలను సైతం కలుపుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ నిబంధనల ప్రకారం బియ్యంలో 5 శాతం వరకు మాత్రమే నూకలకు అనుమతి ఉంది. కానీ రైతుబజార్లలో విక్రయించే బియ్యంలో ఏకంగా 25 శాతం వరకు నూకలు ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాల్సిన ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోంది.
నాణ్యతను పరీక్షించకుండా బియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో వండిన తర్వాత అన్నం ముక్కలైపోవడం, ముద్దగా మారిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని బియ్యాన్ని సన్నబియ్యం పేరుతో అంటగట్టి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు.
జగన్ హయాంలో ధరలపై నిఘా.. ఇప్పుడు మాఫియాకు దన్ను
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో బియ్యం ధరలు పెరిగిన సందర్భాల్లో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునేది. సన్నబియ్యాన్ని తక్కువ ధరలకు మిల్లర్ల ద్వారానే విక్రయించేలా చర్యలు తీసుకునేది. ప్రతి రైస్‌మిల్లు వద్ద ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టికను ప్రదర్శించేవారు. రిటైల్ బియ్యం దుకాణాల వద్ద కూడా ధరల పట్టికలు ఏర్పాటు చేసి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రిటైల్ మార్కెట్‌లో కిలో సన్నబియ్యం రూ.97కు చేరినా ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదు.
ధరల పెరుగుదల అంతర్జాతీయ సమస్య అన్నట్టుగా వ్యవహరిస్తూ చంద్రబాబు సర్కారు బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది. సాధారణంగా ధరలు పెరిగినప్పుడు పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు నిర్వహించాలి. కృత్రిమ కొరత సృష్టించే మిల్లర్లు, వ్యాపారులపై కేసులు నమోదు చేసి అక్రమ నిల్వలను బయటపెట్టాలి.
కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఈ విభాగాలు నామమాత్రంగా మారిపోయాయి. మిల్లర్లపై తనిఖీలు లేవు.. ధరల నియంత్రణ లేదు.. నాణ్యతపై పర్యవేక్షణ అంతకంటే లేదు. రేషన్ బియ్యం రీసైక్లింగ్‌కు ఇబ్బందిగా ఉందన్న సాకుతో వైఎస్ జగన్ హయాంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన సార్టెక్స్ బియ్యం సరఫరాకు చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలికింది.
దీంతో రీసైక్లింగ్ మాఫియాకు మరింత అవకాశం కలి్పంచిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పేదల బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా అమ్ముకుంటూ.. మరోవైపు అదే సన్నబియ్యాన్ని సామాన్యులకు అందనంత ఎత్తుకు ధరలను పెంచుతున్న మాఫియాకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతోంది. తమ జేబులు కొల్లగొడుతున్న ఈ దందాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.


