గోదావరి జలాల పూర్తి వినియోగమే లక్ష్యం | Telangana Godavari Irrigation Projects | Sakshi
Sakshi News home page

గోదావరి జలాల పూర్తి వినియోగమే లక్ష్యం

Nov 17 2026 5:44 AM | Updated on Nov 17 2026 5:44 AM

Telangana Godavari Irrigation Projects

ఆ నది పరిధిలోని ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీతో తెలంగాణ అధికారుల మంతనాలు

సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. సమ్మక్క–సారక్క బరాజ్‌కు సంబంధించి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రావాల్సిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ముంపు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోమవారం సీడబ్ల్యూసీ అధికారులతో చీఫ్‌ ఇంజనీర్‌ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు చర్చలు జరిపారు.

‘సమ్మక్క’ అభ్యంతరాలపై వివరాల అందజేత
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క–సారక్క బరాజ్‌కు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎన్‌ఓసీ రావాల్సి ఉంది. ఈ అనుమతి లేకపోవడంతో ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)పై సీడబ్ల్యూసీ తుది పరిశీలన ముందుకు సాగడం లేదు. సీడబ్ల్యూసీలోని వివిధ విభాగాలు ఇప్పటికే అనుమతులు ఇచ్చినా, అంతర్రాష్ట్ర విభాగం వద్ద ప్రక్రియ నిలిచిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌), బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో ఛత్తీస్‌గఢ్‌లోని భూములు, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

అవసరమైతే ఎన్‌ఓసీ జారీకి ముందే పరిహారం మొత్తాన్ని జమ చేసేందుకు కూడా సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా, సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇటీవల కేంద్రం మరోసారి వెనక్కి పంపడం తెలంగాణకు ఇబ్బందికరంగా మారింది. సాగులోకి తీసుకురావాలని ప్రతిపాదించిన ఆయకట్టు విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు సరిపోలేదని సీడబ్ల్యూసీ పేర్కొనడంతో దానికి సంబంధించిన అంశాలపై సీడబ్ల్యూసీ అధికారులతో రాష్ట్ర అధికారులు చర్చించారు. ప్రతిపాదిత ఆయకట్టు, సాగునీటి ప్రయోజనాలకు సంబంధించిన అదనపు వివరాలను సమరి్పంచినట్టు తెలిసింది.

ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బరాజ్‌ను 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్రతో జరుగుతున్న అధికారుల స్థాయి చర్చలను ముమ్మరం చేయాలని కోరినట్టు సమాచారం.152 మీటర్ల నీటిమట్టంతో మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్‌ జిల్లాల్లో ఏర్పడే ముంపు, పరిహారం చెల్లింపులపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది.

ఛత్తీస్‌గఢ్‌తో చర్చించాల్సిన అంశాలపై సీఎం, మంత్రి సన్నాహక భేటీ.. 
సమ్మక్క బరాజ్‌కు ఎన్‌ఓసీ అంశంపై మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రితో చర్చలు జరపనున్న నేపథ్యంలో సోమవారం ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లు ఢిల్లీలో ముందస్తు చర్చలు జరిపారు. ప్రాజెక్టు తదుపరి అనుమతుల ప్రక్రియకు అవసరమైన నివేదికలు, సీడబ్ల్యూసీ నుంచి వచ్చిన అభిప్రాయాలు,. బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో ముంపునకు గురయ్యే భూములపై సంయుక్త సర్వే అంశాలపై ఇద్దరు చర్చించినట్టు తెలిసింది.

ఇదీ చదవండి: ఎంఎస్పీ చట్టబద్దత కోసం మరో రైతు ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement