పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ పనులు (ఫైల్)
పనుల్లో నాణ్యత లేదు.. తేల్చిచెప్పిన విదేశీ నిపుణుల కమిటీ
ఆగస్టు 28న పీపీఏ, సీడబ్ల్యూసీకి నివేదిక
ప్రధాన డ్యాం పనుల్లోనూ అంతులేని నిర్లక్ష్యం
గ్రేడింగ్ చేసిన రాళ్లు కాకుండా భారీ బండరాళ్ల వినియోగం
డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా ఎండిపోయిన బంకమట్టి
స్కారిఫికేషన్ యంత్రాల్లేవ్.. ట్రాక్టర్ల టిల్లర్లతో పనులు
పూర్తి రికార్డులివ్వకుండా లీకేజీ నివారణ సామర్థ్యం అంచనా ఎలా?
డయాఫ్రం వాల్ మందం 1.5 మీటర్లు లేదు
రెండు మీటర్ల మేర ప్యానళ్లను దించడం లేదు
మరమ్మతులు చేశారు.. నాణ్యతా ధ్రువీకరణ పత్రాలు లేవు
కొన్ని ప్యానెళ్లలో నీటి బుడగలు... సీపేజీకి దారితీసే ప్రమాదం
నిపుణుల బృందంలో నలుగురు సభ్యులు.. కానీ ఒక్కరే పనుల పరిశీలన
మిగిలిన ముగ్గురు నిపుణులు రాకపోవడంపై అనుమానాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందా? ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండటం వల్ల ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందా? డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మాణం కోసం అనుసరిస్తున్న సాంకేతిక నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవా? అంటే అవుననే సమాధానం చెబుతోంది విదేశీ నిపుణుల కమిటీ ఏడో నివేదిక. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అమెరికా, కెనడాలకు చెందిన సి.రిచర్డ్ డొన్నెళ్లి, గియాన్ ఫ్రాంకో డీ సిస్కో, డేవిడ్ పాల్, సీన్ హించ్‌బెర్జర్‌లతో నిపుణుల కమిటీ(పీవోఈ)ని 2024లో కేంద్ర జల్ శక్తి శాఖ నియమించింది. ఇప్పటిదాకా ఏడు సార్లు విదేశీ నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి.. సాంకేతిక సలహాలు అందించారు. ఈ ఏడాది మే 27–28న విదేశీ నిపుణుల బృందంలో ఒకరైన హించ్ బెర్గర్ మాత్రమే పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిగతా ముగ్గురు నిపుణులు ఈ పర్యటనకు ఎందుకు దూరంగా ఉన్నారో అధికారికంగా అటు పీపీఏ గానీ, ఇటు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు గానీ అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. మిగిలిన ముగ్గురు నిపుణులతో సంప్రదించి.. పనులు సాగుతున్న పరిస్థితి, లోపాలను ఎత్తిచూపి వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలు, నాణ్యంగా పనులు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆగస్టు 28న ఏడో నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లకు హించ్ బెర్గర్ అందజేశారు. ప్రాజెక్టు భద్రతకు అత్యంత కీలకమైన సేఫ్టీ మేనేజ్‌మెంట్ ప్లాన్, ఎన్విరాన్‌మెంటల్ ప్లాన్, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ల కాపీలను తమకు అందజేయలేదని, అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియదని నిపుణుల కమిటీ నివేదికలో ఎత్తిచూపింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ...
గ్రేడింగ్ చేసిన రాళ్లెక్కడ?
డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా బంకమట్టి (నల్లరేగడి మట్టి–క్లే)ను పోసి, దాని పక్కన ఇసుక, గ్రేడింగ్ చేసిన రాళ్లు వేసి ప్రధాన డ్యాంను నిర్మించాలి. ప్రధాన డ్యాంకు ఎగువన, దిగువన ఊట నీటికి అడ్డుకట్ట వేయడానికి, కోతకు గురి కాకుండా చేసేందుకు ఫిల్టర్ (గ్రేడింగ్ చేసిన చిన్న చిన్న రాళ్లను సమాంతరంగా ఏకరీతిగా పోసి, దాని పక్కన ఇసుక పొర, దానికి పక్కన గ్రేడింగ్ చేసిన రాళ్లతో మరో పొర వేస్తారు) వేయాలి. ప్రధాన డ్యాం గ్యాప్–2లో ఫిల్టర్ పనుల్లో పెద్ద పెద్ద రాళ్లను వేస్తున్నారని.. కాంట్రాక్టర్ భారీ బండరాళ్లను తెచ్చి, హో ర్యామ్స్ యంత్రాలతో వాటిని పగులగొట్టడం తాను కళ్లారా చూడటాన్ని విదేశీ నిపుణుడు హించ్ బెర్గర్ నివేదికలో ప్రస్తావించారు. గ్రేడింగ్ చేసిన రాళ్లను కాకుండా పెద్ద పెద్ద రాళ్లతో ఫిల్టర్ నిర్మిస్తే.. రాళ్ల మధ్య సందుల నుంచి ఊట నీరు ప్రవహించడంతోపాటు నదీ గర్భం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని.. ఇది ప్రధాన డ్యాంకు గండ్లు పడేందుకు దోహదం చేస్తుందని.. ఇది ప్రధాన డ్యాం భద్రతకే సవాల్‌గా మారుతుందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు.
స్కారిఫికేషన్ యంత్రాలెక్కడ?
ప్రధాన డ్యాం నిర్మాణంలో రాతి, మట్టితో ఒక పొర వేసి దాన్ని భారీ రోలర్‌లతో గట్టిపరిచి.. దానిపై మరో పొర వేస్తూ సముద్రమట్టానికి 53 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించాలి. దిగువన ప్రధాన డ్యాం వెడల్పు దాదాపు 300 మీటర్లు ఉంటే.. పైభాగానికి వచ్చే సరికి 15 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇలా పొరలు పొరలుగా రాళ్లు, మట్టిని వేసి నిర్మించాలి. ఒక పొరను వేశాక దానిపై మరొక పొర వేసే ముందు కింది పొరను గీకి, రఫ్‌గా(స్కారిఫికేషన్) చేయాలి. అప్పుడు రెండు పొరలు బాగా అతుక్కుపోతాయి. కానీ.. స్కారిఫికేషన్ చేయడానికి యంత్రాలు లేకపోవడంపై విదేశీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా పక్కనే ఉన్న పొలాల నుంచి ట్రాక్టర్ టిల్లర్లతో స్కారిఫికేషన్ చేస్తున్న వైనాన్ని విదేశీ నిపుణులు నివేదికలో ప్రస్తావించారు. స్కారిఫికేషన్ సక్రమంగా చేయకపోతే రెండు పొరలు సరిగ్గా అతుక్కోవని.. ఇది డ్యాం స్థిరత్వానికి, భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
డయాఫ్రంవాల్‌ను 1.5 మీటర్ల మందంతో నిర్మించాలి.. కానీ దాన్ని నిర్మించడానికి తవ్వే కట్టర్ మందం 1.5 మీటర్లని.. లోతుకు వెళ్లే కొద్దీ కట్టర్ పక్కకు జరగడం లేదా తిరగడం వల్ల, ఒక ప్యానల్ మరో ప్యాన్‌లతో ఓవర్ ల్యాప్ అయినప్పుడు ఆ జాయింట్లలో మందం తగ్గిందా లేదా అన్నది తేల్చాలని నివేదికలో సూచించిన నిపుణుల కమిటీ
బంకమట్టిలో తేమ ఏది?
డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా నల్లరేగడి–బంకమట్టిని వేయాలి. ఈ బంకమట్టిలో తగినంత తేమ ఉండాలి. అప్పుడే తగినంత మేర బంకమట్టి సాగి డయాఫ్రం వాల్‌కు రక్షణగా నిలుస్తుంది. కానీ.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా పోస్తున్న బంకమట్టిలో తగినంత తేమ లేక ఎండిపోయి ఉందని.. దీనికి సాగే గుణం ఉండదని.. దీని వల్ల డ్యాం నిర్మాణంలో అంతర్గతంగా పగుళ్లు ఏర్పడతాయని.. ఇది డ్యాం భద్రతను ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించింది.
పూర్తి రికార్డులు లేకుండా అంచనా ఎలా?
ప్రధాన డ్యాం గ్యాప్–1 వద్ద లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి కర్టెన్ గ్రౌటింగ్(బోరు వేసి అధిక ఒత్తిడితో సిమెంటు కాంక్రీట్‌ను పంపడం ద్వారా భూగర్భంలో చీలికలను మూసేయడం) చేయాలి. కానీ.. 2026, మే 25 నాటికి 242 గ్రౌటింగ్ హోల్స్‌కుగానూ 213.. 46 కర్టన్ గ్రౌటింగ్ హోల్స్‌కుగానూ 42 పూర్తి చేశారని.. వాటికి సంబంధించి ప్రైమరీ చెక్‌హోల్స్ ఫలితాలు మాత్రమే ఇచ్చారని.. సెకండరీ, టెర్షియరీ హోల్స్‌కు సంబంధించి పూర్తి రికార్డులు ఇవ్వకపోవడం వల్ల లీకేజీ నివారణ సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయలేమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
ప్యానళ్లను సరిగా దించలేదు..
డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం కట్టర్లు, గ్రాబర్లతో భూమిని తవ్వుతూ ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని పంపుతూ.. రాతిపొరలోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానళ్లను దించే వరకూ తవ్వుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం వెలుపలికి వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమం కాంక్రీట్ మిశ్రమంతో కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా ఏర్పడి.. పెద్ద గోడగా మారుతుంది. అదే డయాఫ్రం వాల్. కానీ.. డయాఫ్రం వాల్ నిర్మాణంలో ప్యానళ్లను కఠిన శిలలోకి రెండు మీటర్ల లోతు వరకూ దించే విధాన్ని అత్యంత లోపభూయిష్టంగా చేశారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. కఠిన రాతి శిల పైపొర ప్యానల్‌కు తగిలినప్పటి నుంచి ఐదు నిముషాల వరకూ నిరంతరాయంగా రాతి ముక్కలు బయటకు వచ్చినప్పుడే రాతి పొరలోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానల్‌ను దించినట్లుగా లెక్కించాలని స్పష్టం చేసింది.
మరమ్మతుల పత్రాలివ్వలేదు..
డయాఫ్రం వాల్ పైభాగాన్ని ట్రిమ్ చేసిన తర్వాత పరిశీలిస్తే.. ప్యానెళ్ల జాయింట్లు వద్ద, అలైన్‌మెంట్ వ్యత్యాసాలు, కాంక్రీట్ లోపాలు బయటపడ్డాయని నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. వాటిలో కొన్నింటికి మరమ్మతులు చేశారని గుర్తించింది. ఎంత లోతు వరకూ మరమ్మతులు చేశారు.. అందులో వినియోగించిన పదార్థాలు ఏమిటి? అధికారికంగా పీపీఏ తనిఖీ చేసి, నాణ్యత ధ్రువీకరణ పత్రాలు ఏవీ తమకు ఇవ్వలేదని విదేశీ నిపుణులు నివేదికలో ఎత్తిచూపారు.
మందాన్ని ధ్రువీకరించలేదు..
డయాఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందంతో నిర్మించాలి. ఆ మేరకు నిర్మించామని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. కానీ.. దాన్ని నిర్మించేందుకు వినియోగించిన కట్టర్ యంత్రం మందం 1.5 మీటర్లు.. అది డయాఫ్రం వాల్ మందాన్ని ధ్రువీకరించలేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. భూమి లోపలకు వెళ్లే కొద్దీ కట్టర్ యంత్రం పక్కకు జరగడం లేదా తిరగడం.. ఒక ప్యానల్ మరో ప్యానల్‌తో జతచేసినప్పుడు(ఓవర్ ల్యాప్) డయాఫ్రం వాల్ వైశాల్యం మారిపోతుందని.. ఎక్కువ లోతుకు వెళ్లినప్పుడు గోడ మందం తగ్గిపోయే ప్రమాదం ఉందని.. అది 0.9 మీటర్లకు కూడా చేరే అవకాశం ఉందని గతంలోనూ తాజాగానూ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. డయాఫ్రం వాల్ మందం ఏకరీతిగా ఉందా లేదా తెలుసుకోవడానికి కట్టర్, కోడెన్ సర్వే డేటాలను కలిపి పూర్తి స్థాయి నివేదికను తయారుచేయాలని సూచించింది. 
ప్రధాన డ్యాం నిర్మాణ పనుల్లో ఒక పొరపై మరొకటి వేసేటప్పుడు కింది పొరను రఫ్ చేయడానికి స్కారిఫికేషన్ చేయడానికి యంత్రాలు లేవని.. సమీపంలోని పొలాల్లో ట్రాక్టర్ టిల్లర్లతో స్కారిఫికేషన్ చేస్తున్నారంటూ ఫొటో సాక్ష్యాలతో నివేదికలో పేర్కొన్న నిపుణుల కమిటీ
ప్యానళ్లలో నీటిబుడగలున్నాయి..
డయాఫ్రం వాల్ నిర్మాణానికి వినియోగించిన 365 ప్యానళ్లలో 38 ప్యానళ్లలో నీటి బుడగలు (నీటి ఊట లేదా బ్లీడింగ్) కన్పించింది. కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల సిమెంటు, ఇసుక, బెంటనైట్, కంకర విడిపోవడం(సెగ్రిగేట్) వల్ల బ్లీడింగ్ అయినట్లు గతంలో విదేశీ నిపుణులు ఎత్తిచూపారు. ఇది సీపేజీకి దారి తీస్తుందని పేర్కొన్నారు. కానీ.. అడ్డంగా తీసిన కోర్(సిమెంటు కాంక్రీట్) నమూనాలను పరీక్షించిన ఫలితాలు చూస్తే అవన్నీ బాగానే ఉన్నట్లు హించ్ బెర్గర్ పేర్కొన్నారు. కాగా ప్రధాన డ్యాంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుసరిస్తున్న సాంకేతిక ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ ఆక్షేపిస్తూనే.. డయాఫ్రం వాల్ పటిష్ఠంగా ఉందని.. సమర్థవంతంగా ఊట నీటిని అడ్డుకుంటుందంటూ నివేదికలో హించ్ బెర్గర్ పేర్కొనడం గమనార్హం!
ప్రధాన డ్యాం పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రదేశంలో భూభౌగోళిక పరిస్థితుల ఆధారంగా నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసేలా ప్రధాన డ్యాం, నదీ తీరానికి కుడి వైపున రాతి నేలపై వరదను మళ్లించేలా స్పిల్ వేను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. ఈ డిజైన్ ప్రకారం గోదావరి నదీ గర్భంలో గ్యాప్–1లో 564 మీటర్ల పొడవున, గ్యాప్–2లో 1750 మీటర్ల పొడవున రాళ్లు, మట్టితో ప్రధాన డ్యాంను నిర్మించాలి. నదీ గర్భంలో ఊట(సీపేజీ) నీటిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి ప్రధాన డ్యాంకు పునాదిగా డయాఫ్రం వాల్‌ను నిర్మించాలని సీడబ్ల్యూసీ సూచించింది. కానీ ప్రధాన డ్యాం పనుల్లో అంతులేని నిర్లక్ష్యాన్ని హించ్ బెర్గర్ గుర్తించారు.
డయాఫ్రం వాల్ నిర్మాణంలోనూ లోపాలు
గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్‌ను 2016–18 మధ్య నిర్మించి సీఎం చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని ఇంజినీరింగ్ నిపుణులు ఆది నుంచి ఎత్తిచూపుతున్నారు. దీనివలన గోదావరి ప్రవాహ ఉద్ధృతికి ఆ డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. దాంతో ఆ దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మించాలని విదేశీ నిపుణులు చేసిన సూచనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. 1,372.6 మీటర్ల పొడవున 1.5 మీటర్ల మందంతో గరిష్ఠంగా 97.6 మీటర్ల లోతు నుంచి డయాఫ్రం వాల్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. 365 ప్యానళ్లతో 67,147.9 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ పనులు చేయాలి. డయాఫ్రం వాల్ పనులను 2025, జనవరి 18న ప్రారంభించి.. 2026, ఏప్రిల్ 2 నాటికి అంటే 439 రోజుల్లో పూర్తి చేశారు. డయాఫ్రం వాల్ పనులు చేస్తున్న క్రమంలో విదేశీ నిపుణులు సందర్శించి.. పలు లోపాలను ఎత్తిచూపి.. వాటిని సరిచేయాలని సూచించారు. పనులు పూర్తయ్యాక ఏడో సారి సందర్శించినప్పుడూ అదే కథ.


