ఆకాశమంత పందిరి, భూదేవంత పీట ఘనమైన పెళ్లికి నిర్వచనం ఇది మాత్రమే కాదు ఇంకా ఉంది అంటోంది ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా, నాగలా ఫౌదా గ్రామానికి చెందిన ఒక కుటుంబం. రూ. 500 నోట్లతో రూ. 2 కోట్ల విలువైన సుమారు 100 అడుగుల దండతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు నెట్టింట తెగ సందడి చేస్తున్నాడు ఒక బామ్మర్ది. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా, నాగలా ఫౌదా గ్రామంలో జరిగిన ఒక వివాహ ఊరేగింపు ఇపుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలో ఇద్దరు వరులకు వారి బావ ఒక్కొక్కరికి రూ. కోటి విలువైన కరెన్సీ నోట్ల దండలను బహుమతిగా ఇవ్వడమే దీనికి కారణం. ఈ బారాత్‌లో ఒక్కో విశేషం గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. బావమరిది అంటే బతుకు కోరేవాడు అన్నట్టు ఇద్దరు వరులకు వారి బామ్మర్ది ఒక్కొక్కరికి రూ. 1 కోటి విలువైన కరెన్సీ నోట్ల దండలను బహుమతిగా ఇవ్వడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్‌లోని కామా ప్రాంతానికి చెందిన నందోలి గ్రామానికి చెందిన యోగేష్ కుమార్ ఠాకూర్, తన బావమరుదులైన వీరికి ఈ భారీ దండలను బహుకరించారు.శనివారం జరిగిన అన్నదమ్ముల కుమారులైన (కజిన్స్) ప్రశాంత్ సింగ్, కాన్హా రాఘవ్‌ల 'ఘుడ్‌చడీ' (గుర్రపు స్వారీ) వేడుకలో ఈ భారీ బహుమతిని అందజేశారు.సుమారు 100 అడుగుల పొడవున్న ఒక్కో దండను రూ. 500 నోట్లతో తయారు చేయించాడు. 100-feet-long currency garlands ఈ దండలు ఎంత పొడవుగా ఉన్నాయంటే, వాటిని మోయడానికి, సర్దడానికి చాలామంది అవసరమయ్యారు. అంతేకాదు పెళ్లి కొడుకులను ఇంటి పైకప్పుపై నిలబెట్టి మరీ వారి మెడలో ఈ భారీ దండలను వేయాల్సి వచ్చింది. మథురలోని గోవర్ధన్ ప్రాంతంలో ఉన్న ఒక వివాహ వేదిక వద్ద వీరిద్దరి వివాహాలు జరిగాయి.
ఇదీ చదవండి :బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్ ఆఫర్
వీరిద్దరూ భారతీయ కిసాన్ యూనియన్ (భాను)కు చెందిన రైతు నాయకుడు మహావీర్ స్వామికి మేనల్లుళ్లు అని తెలుస్తోంది. ఇరు కుటుంబాలు మార్పుల్ అండ్ స్టోన్ షోరూంల వ్యాపారంలో ఉన్నట్లు సమాచారం. ఈ విభిన్నమైన వివాహ కానుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం!


