అనుమతి లేకుండా వీడియో తీయడంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
ఆ వ్యక్తి క్షమాపణ కోరడంతో పోలీస్ కస్టడీ చర్యల నిలిపివేతకు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు హాల్‌లో జరుగుతున్న కేసు విచారణను అనుమతి లేకుండా సెల్ ఫోన్‌లో రికార్డు చేసిన వ్యక్తిపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రీకరించిన వ్యక్తిని పోలీసు కస్టడీకి ఆదేశించింది. బహిరంగ న్యాయ విచారణ అంటే ప్రజలు హాజరు కావడానికి వీలు కల్పించడమే తప్ప, కోర్టు కార్యకలాపాలను ఉచితంగా ప్రసారం చేసేందుకు ఇచ్చిన హక్కు కాదని తెలిపింది. గురు, శుక్రవారాల్లో జరిగిన ‘కుల్దీప్ బాత్రా వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం’కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
ఛాంబర్ పాస్‌తో ప్రవేశం.. 3 వీడియోలు లభ్యం..
నవంబర్ 19న విచారణ జరుగుతుండగా వారణాసికి చెందిన రాజ్ కులశ్రేష్ఠ మొబైల్ ఫోన్‌లో కార్యకలాపాలను రికార్డు చేస్తుండటాన్ని ధర్మాసనం గుర్తించింది. అతని వద్ద కేవలం న్యాయవాదుల ఛాంబర్‌లోకి వెళ్లే పాస్ మాత్రమే ఉందని, కోర్టు హాల్ పాస్ లేదని తేలింది. వీడియో ఎందుకు తీస్తున్నాడో అతను వివరించలేకపోయాడు. కోర్టు సిబ్బంది ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, విచారణకు సంబంధించిన కనీసం మూడు వీడియోలు అందులో కనిపించాయి.
దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని ప్రయాగ్‌రాజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. వ్యక్తిగత బాండ్, ఇద్దరు జామీనుదారులతో బెయిల్ పొందినా నవంబర్ 20 ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని షరతు విధించింది. శుక్రవారం పోలీసు కస్టడీలో హాజరైన కులశ్రేష్ఠ క్షమాపణ కోరడంతో కోర్టు చర్యలను నిలిపివేసి విడుదల చేసింది. రికార్డింగ్‌లను తొలగించి, ఫోన్ రీసెట్ చేశాకే అప్పగించాలని, వాటిని సోషల్ మీడియాలో ప్రచురించకూడదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా ట్రయల్‌కు తావులేదు
కోర్టు విధివిధానాలను నియంత్రించుకునే అంతర్గత అధికారాలు తమకు ఉంటాయని ధర్మా సనం పేర్కొంది. కోర్టు విచారణలు వినోదం కాదని, వ్యక్తుల స్వేచ్ఛ, హక్కులతో ముడిపడి న తీవ్రమైన అంశాలని తెలిపింది. అనుమతి లేకుండా రికార్డు చేయడం వల్ల తుది తీర్పు రాకముందే ‘సోషల్ మీడియా ట్రయల్’జరిగే ప్రమాదం ఉందని, బాధితులు డిజిటల్ మాధ్యమాల్లో అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ, చిన్నారులపై లైంగిక వేధింపులు, సీబీఐ, ఈడీ, ఎంపీ/ఎమ్మెల్యేలకు సంబంధించిన సున్నితమైన కేసులు తమ వద్దకు వస్తాయని, తుది నిర్ణయం వెలువడకముందే ఆ వివరాలు సోషల్ మీడియాలో ప్రచురితం కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
న్యాయవాదులదే పూర్తి బాధ్యత
కక్షిదారులు తమ ఫోన్లను న్యాయ వాది కార్యాలయంలో లేదా బయట ఉంచి రావాలని, కోర్టు హాల్‌లో ఫోన్ దొరికితే సంబంధిత న్యాయవాదే పూర్తి బాధ్యత వహించాలని ధర్మాసనం ఆదే శించింది. ఈ నిబంధనపై పాస్ కౌంటర్ వద్ద నోటీసు అంటించాలని రిజిస్ట్రార్ జనరల్‌ను, సరైన పాస్ లేనివారిని అను మతించవద్దని రిజిస్ట్రార్ (ప్రోటోకాల్) ను ఆదేశించింది. న్యాయవాదులు మినహా ఇతరులకు ఫోన్లకు అనుమతి లేదనే విషయాన్ని పాస్‌లపై ముద్రించాలని సూచించింది. కోర్టు హాళ్ల భద్రతపై విచారిస్తున్న డివిజన్ బెంచ్‌కు ఈ అంశాన్ని బదిలీ చేసింది.


