సెంచరీ పూర్తయింది! | Parliament Monsoon session remains unprorogued for 100 days | Sakshi
Sakshi News home page

సెంచరీ పూర్తయింది!

Nov 22 2026 5:16 AM | Updated on Nov 22 2026 5:16 AM

Parliament Monsoon session remains unprorogued for 100 days

ఇంకా అధికారికంగా ముగియని పార్లమెంటు వర్షాకాల సమావేశాలు  

ప్రోరోగ్‌ కాకపోవడంలో కొత్త రికార్డు నమోదు  

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించలేదు. 100 రోజులైనా పార్లమెంట్‌ సమావేశాలను ప్రోరోగ్‌ చేయకపోవడం ఇదే మొదటిసారి. ఇదొక కొత్త రికార్డు. 2008లో 87 రోజులైనా ప్రోరోగ్‌ చేయలేదు. ఈ రికార్డు నేడు చెదిరిపోయింది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి, అయితే, శనివారం ఉదయానికల్లా లోక్‌సభ లేదా రాజ్యసభల్లో.. ఏ సభ కూడా అధికారికంగా ముగియలేదు. 

మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం లేదా వర్షాకాల సమావేశాలను పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. బిల్లు ఈసారి కచ్చితంగా ఆమోదం పొందుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. 

అయితే, ఈ ప్రతిపాదిత సమావేశానికి సంబంధించి తేదీలను గానీ, వ్యవధిని గానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ప్రస్తుత సమావేశాన్ని పొడిగించాలంటే కనీసం రెండు రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది, అదే కొత్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఒక సభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత, దానిని ముగించేందుకు రాజ్యాంగం ఎలాంటి నిర్దిష్ట కాల వ్యవధిని నిర్ణయించలేదు. ఒక సమావేశాన్ని సుదీర్ఘకాలం పాటు ముగించకుండా ఉంచడం అనేది రాజ్యాంగపరంగా తప్పేమీ కాదు.  

పునర్విభజనను వాయిదా వేయాలి: జైరామ్‌ రమేశ్‌  
ఈ ఏడాది పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి, ఇంకా ప్రోరోగ్‌ చేయక నేటికి 100 రోజులు అయ్యిందని అయినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రధానమంత్రి–హోంశాఖ మంత్రి జోడి ఇప్పటికీ అన్వేషణ సాగిస్తూనే ఉందని తెలిపారు. 

పాత బిల్లు 2026 ఏప్రిల్‌ 17న వీగిపోయినందున కొత్త బిల్లులో ఏముంటుందో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరే వరకు, మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్‌ను అమలులో ఉంచి, లోక్‌సభలో ఎంపీల సంఖ్యను, రాష్ట్రాల వారీ ఎంపీల కూర్పును కొనసాగనివ్వడమే దేశ ప్రయోజనాలకు మంచిదని అభిప్రాయపడ్డారు. కొత్త బిల్లు గురించి ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీతోనూ చర్చించలేదని వెల్లడించారు. 

తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీకి నాలుగు లేఖలు రాసినప్పటికీ.. ఇప్పటివరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆక్షేపించారు. పరిష్కరించాల్సిన సవాళ్లు ఎన్నో ఉన్నాయని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రస్తుతానికి వాయిదా వేయాలని మోదీ ప్రభుత్వానికి జైరామ్‌ రమేశ్‌ సూచించారు. 1976లో ఇందిరా గాంధీ 25 ఏళ్లపాటు, 2001లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి 25 ఏళ్లపాటు వాయిదా వేశారని గుర్తుచేశారు. వారు ఎంతో వివేకవంతులైన, దేశభక్తి కలిగిన ప్రధానమంత్రులు అని కొనియాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement