అయోధ్య ఆలయంలో విరాళాల స్వాహాపై కాంగ్రెస్ ఫైర్
బాధ్యులను వదిలేసి.. చిరు ఉద్యోగులపై కేసులా?
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాల్సిందే
దోషులకు శిక్ష పడేలా ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: రాముడి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అయోధ్య రామమందిరంలో జరిగిన విరాళాల చోరీపై కిమ్మనడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడి పేరిట వచ్చిన విరాళాలను లూటీ చేస్తుంటే చోద్యం చూస్తున్నారని, కిందిస్థాయి ఉద్యోగులను అరెస్టు చేసి అసలు బాధ్యులైన పెద్దలకు సిట్ ద్వారా క్లీన్‌చిట్ ఇప్పించారని ఆరోపించారు. అయోధ్య రామమందిరంలో వెలుగుచూసిన చందాల కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన పలు గణాంకాలు, దర్యాప్తు తేదీలను ప్రస్తావిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జైరాం రమేశ్ ఎండగట్టారు.
నిందితుల కనుసన్నల్లోనే దర్యాప్తు..:
అయోధ్య రామమందిరంలో చందాల చోరీ వ్యవహారం జూన్ 4వ తేదీన వెలుగులోకి రాగా, 9 రోజుల పాటు వేచిచూసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలయ ట్రస్ట్ వినతి మేరకు జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్)ను ఏర్పాటు చేసిందని జైరాం రమేశ్ విమర్శించారు. దర్యాప్తు జరిపిన హోంశాఖ ఆగస్టు 17న తన తుది నివేదికను తిరిగి అదే ట్రస్ట్‌కు సమరి్పంచిందని చెప్పారు. అందరూ ఊహించినట్లుగానే ఈ నివేదికలో ట్రస్ట్ కీలక సభ్యులైన చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇచ్చిందని మండిపడ్డారు. నిందితుల కనుసన్నల్లోనే, వారికి అనుకూలంగా సిట్ దర్యాప్తు సాగిందనడానికి ఇదే నిదర్శనమని ఆక్షేపించారు.
దొంగతనం 105 సార్లు రికార్డు
ఏప్రిల్ 27– జూన్ 5 మధ్యకాలంలో సీసీటీవీ ఫుటేజీల్లో చోరీ ఘటనలు ఏకంగా 105 సార్లు కెమెరాల్లో రికార్డయ్యాయని జైరాం రమేశ్ వెల్లడించారు. నగదు లెక్కిస్తున్న సిబ్బంది నోట్ల కట్టలను దాచడం అందులో స్పష్టంగా కనిపించిందన్నారు. అయితే, ఇప్పటివరకు ఎంత నగదు, ఎన్ని విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయో దేశ ప్రజలకు వెల్లడించనేలేదన్నారు. జూన్ 23న వెల్లడైన ప్రాథమిక నివేదికలో నిఘా నిబంధనలు పాటించలేదని, కంట్రోల్ రూమ్‌ను పలుమార్లు ఖాళీగా వదిలేశారని స్పష్టమైందన్నారు. ఎంత సొమ్ము పోయిందో లెక్క తేలకుండానే దర్యాప్తును ఎలా ముగించారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
కోశాధికారికి బాధ్యత లేదా?
ఆలయ ఖజానా బాధ్యత ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరిపై ఉన్నందున ప్రధానంగా జవాబుదారీతనం ఆయనదేనని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. నిధుల రాకపోకలపై కోశాధికారికి పూర్తి అవగాహన ఉండాలని అయోధ్య సాధువులు సైతం చెప్పారని ఆయన గుర్తుచేశారు. అయినా జూలై 7న గోవింద్ గిరి స్పందిస్తూ ఈ కుంభకోణంలో చంపత్ రాయ్ పాత్ర లేదని సర్టీఫికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. జూన్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, మరుసటి రోజు నగదు లెక్కింపునకు సంబంధించిన కిందిస్థాయి ఉద్యోగులు 8 మందిని మాత్రమే అరెస్టు చేశారని విమర్శించారు. ఏ ఒక్క ట్రస్ట్ మాజీ, ప్రస్తుత పదాధికారుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని ఆక్షేపించారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఎవరినీ ఈడీ, సీబీఐ అధికారులు ఎందుకు విచారించలేదని ఆయన ప్రశ్నించారు.
అందుకే అయోధ్యలో బుద్ధి చెప్పారు..
సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని ఓడించడం ద్వారా అక్కడి ప్రజలు గట్టి సంకేతం ఇచ్చినా ఆ పార్టీకి తత్వం బోధపడలేదని జైరాం రమేశ్ ఎండగట్టారు. చందాల చోరీ వ్యవహారం బయటపడి నాలుగున్నర నెలలు దాటుతున్నా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అజయ్ సింగ్ బిష్ట్ (యోగి ఆదిత్యనాథ్), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. సంఘ్ పరివార్‌తో సంబంధం ఉన్న ఇలాంటి వారిపై బీజేపీ ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపి చందాల లెక్కలను పూర్తిగా బహిర్గతం చేయాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికార అహంకారంలో మునిగిపోయిన ఇలాంటి చందా చోరులకు దేశ పౌరులే తగిన శాస్తి చేయాలని జైరాం రమేశ్ పిలుపునిచ్చారు.


