50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి | PM Narendra Modi launches development projects worth Rs 34 470 crore in Bihar | Sakshi
Sakshi News home page

50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి

Nov 22 2026 4:53 AM | Updated on Nov 22 2026 4:53 AM

PM Narendra Modi launches development projects worth Rs 34 470 crore in Bihar

నితీశ్‌ సేతు ప్రారంభం సందర్భంగా గమ్చాతో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

పేదరికంపై ప్రజలు విజయం సాధిస్తుండటం సంతోషంగా ఉంది  

బిహార్‌ పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి  

రూ. 34,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం  

స్పష్టమైన సంకల్పంతో పనిచేస్తే ఫలితాలు అందరికీ కనిపిస్తాయని స్పష్టీకరణ

వైశాలి: తాము అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో దేశంలో 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. దశాబ్దాల తరబడి తప్పుదారి పట్టించే నినాదాలతో ప్రజల ఓట్లు కొల్లగొట్టిన గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు చొరవ చూపలేదని విమర్శించారు. శనివారం బిహార్‌ రాష్ట్రం వైశాలి జిల్లాలో మోదీ పర్యటించారు. జాఫర్‌పట్టి ఏరియాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.34,000 కోట్ల విలువైన 227 మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

 స్పష్టమైన సంకల్పంతో పని చేసినప్పుడు ఫలితాలు అందరికీ కనిపిస్తాయని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ‘గరీబీ హఠావో’నినాదం వినిపించాయి తప్ప పేదరికాన్ని తొలగించలేకపోయాయని చెప్పారు. అందుకు భిన్నంగా తమ ప్రభుత్వం 50 కోట్ల మందికి పేరికం నుంచి విముక్తి కల్పించిందని స్పష్టంచేశారు. ఇది పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న దృఢ సంకల్పానికి, నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాం, లక్షలాది మందికి పక్కా ఇళ్లు ఇచ్చామని, వారికి ఉచిత వైద్య చికిత్సను కూడా అందించామని తెలిపారు.   

మనం ఆగకూడదు, అలసిపోకూడదు  
బిహార్‌లో ఎన్డీయే నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను సజావుగా అమలు చేస్తోందని, తద్వారా పేదరికానికి వ్యతిరేకంగా సాగిస్తున్న తమ పోరాటంలో ఈ రాష్ట్రం ఎంతో గొప్ప సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఎన్డీయే అధికారంలోకి రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒక్కసారి ఆలోచించుకోవాలని బిహార్‌ ప్రజలకు సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో నేరాలు, కుంభకోణాలు విచ్చలవిడిగా జరిగేవని గుర్తుచేశారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, బిహార్‌ ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఉద్ఘాటించారు. 

గతంలో కుంభకోణాల గురించి చర్చ జరిగేది, ఇప్పుడు పెట్టుబడులు, అభివృద్ధికి సంబంధించిన చర్చ జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు వేలాది గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం లేని ఈ రాష్ట్రం నేడు విద్యుత్‌ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారిందని తెలిపారు. ఇప్పుడు మనం ఆగకూడదు, అలసిపోకూడదని పేర్కొన్నారు. బిహార్‌ను బలంగా, సుసంపన్నంగా, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫొటోను ‘ఎక్స్‌’లో మోదీ షేర్‌ చేశారు. వైశాలి జిల్లాలో గంగా నదిపై నిర్మించిన వంతెనను మోదీ ప్రారంభించారు. ఈ వంతెనకు బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పేరు పెట్టారు. దీన్ని నితీశ్‌ సేతుగా పిలుస్తున్నారు.  

గమ్చాతో ప్రజలకు అభివాదం  
నితీశ్‌ సేతు ప్రారం¿ోత్సవం సందర్భంగా మోదీ తన భుజంపై ఉన్న గమ్చా(కండువా)ను ఊపుతూ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు. ఆరు వరుసల వంతెనపై వెడల్పుగా కట్టిన రిబ్బన్‌ను కత్తిరించారు. ఆ తర్వాత 9 కిలోమీటర్లకు పైగా పొడవున్న ఈ వంతెనపై కొంతదూరం నడిచారు. రూ.4,280 కోట్ల వ్యయంతో నితీశ్‌ సేతును నిర్మించారు. నితీశ్‌ కుమార్‌ అందించిన సేవలకు గాను బిహార్‌ ప్రజలకు ఆయన పట్ల ఉన్న గౌరవానికి ఇది ఒక చిహ్నం అని మోదీ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement