వైఫల్యాలను మోదీ అంగీకరించారు | Rahul Gandhi Slams Modi Jobs Monopoly | Sakshi
Sakshi News home page

వైఫల్యాలను మోదీ అంగీకరించారు

Nov 21 2026 4:01 AM | Updated on Nov 21 2026 4:01 AM

Rahul Gandhi Slams Modi Jobs Monopoly

దేశంలో గుత్తాధిపత్యాలను సృష్టించి, సమాన అవకాశాలను దెబ్బతీస్తున్నారు

మోదీ, ఆయన స్నేహితులు కలిసి దోపిడీకి పాల్పడ్డారు

రాహుల్‌ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: దేశంలో నూతన ఉద్యోగాల కల్పన, వేతనాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అంగీకరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తేల్చిచెప్పారు. గురువారం ఫిక్కి సర్వసభ్య సమావేశంలో పారిశ్రామిక వర్గాలపై మోదీ చేసిన విమర్శల పట్ల రాహుల్‌ శుక్రవారం స్పందించారు. దేశంలో గుత్తాధిపత్యాలను సృష్టించి, సమాన అవకాశాలను దెబ్బతీస్తున్నారని, ఈ విషయాన్ని మోదీ ఒప్పుకున్నట్లేనని స్పష్టంచేశారు.

ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇస్తున్నప్పటికీ పారిశ్రామిక వర్గాలు కొత్త ఉద్యోగాలు సృష్టించడం లేదని, వేతనాలు పెంచడం లేదని మోదీ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలపై మోదీ చేసినవి ఆరోపణలు కాదని, అవి ఆయన సొంత ఒప్పుకోళ్లు అని రాహుల్‌ ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘పారిశ్రామికవేత్తలకు ఎంత పెట్టినా వారి ఆకలి తీరదని మోదీ అంటున్నారు. నిజమే.. బాగా చెప్పారు. ఈ ఆకలి ఎవరిదో దేశం మొత్తానికి తెలుసు.

విమానాశ్రయాలు, ఓడరేవులు, గనులు, అడవులు, విద్యుత్, బొగ్గు, రహదారులు.. వీటిని ఎవరి చేతుల్లో పెట్టా రో తెలుసు. వారు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చెప్పాలి. యువతకు ఉద్యోగాలు సృష్టించే చిన్న వ్యాపారులను, ఎంఎస్‌ఎంఈలను పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జీఎస్టీతో నాశనం చేశారు. నిజాయతీగా పోటీపడిన పెద్ద కంపెనీలను తరిమేశారు. పోటీ వాతావరణమే లేకుండా చేశారు. గుత్తాధిపత్యం ఎప్పటికీ ఉద్యోగాలను సృష్టించదు. అది ధరలను పెంచి, పోటీని నిర్మూలిస్తుంది.

మోదీజీ.. మీరూ మీ స్నేహితులూ కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఇది దేశం మొత్తం చూసింది, ఇప్పటికీ చూస్తూనే ఉంది. మోదీ చేసిన ప్రసంగానికి చప్పట్లు రాకపోవడంతోనే ఆయన అసహనానికి గురయ్యారు. మీ విధానాల వల్ల బాగుపడ్డవారు బడా బాబులు తప్ప ఎవరూ లేరు. చిన్న వ్యాపారులు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగ యువత విసిగిపోయారు. మీకు మిగిలి ఉన్న కొద్దిమంది ‘భక్తుల’నుంచే మీకు చప్పట్లు లభిస్తాయి. వారితోనే పళ్లెం కొట్టించుకోండి’’అని రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధాని  మోదీ తన వైఫల్యాలకు పారిశ్రామిక వర్గాలను బాధ్యులను చేస్తూ నిందించారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విమర్శించారు. మోదీ ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరించారని శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. నేడు దేశంలో యువతకు ఉద్యోగాలు లేవని, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందని, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కాస్తా ‘బై ఫ్రమ్‌ చైనా’గా మారిందని ఆరోపించారు.

రాజీపడిన ప్రధాని ఆ వేదికపై కూర్చోలేరు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ  ‘ఎక్స్‌’ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా, చైనా, రష్యా దేశాధినేతల త్రైపాక్షిక సమావేశంపై ఎక్స్‌ వేదికగా స్పందించిన రాహుల్‌... ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్‌ ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండి ఉంటే వారితోపాటు ఆ వేదికపై భారత ప్రధాని కూర్చుని ఉండేవారన్నారు.

కానీ, రాజీపడిన మన ప్రస్తుత ప్రధాని ఆ వేదికపై ఎప్పటికీ కూర్చోలేరని విమర్శించారు. చైనాలోని టెక్‌ హబ్‌ అయిన షెన్‌జెన్‌లో గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల మధ్య చరిత్రాత్మక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: 4 రఫేల్‌ ఫైటర్‌ జెట్లు మిస్సింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement