తొలి దేశీయ బర్డ్‌ఫ్లూ టీకా ఆవిష్కరణ | India Indigenous H5n1 Bird Flu Vaccine | Sakshi
Sakshi News home page

తొలి దేశీయ బర్డ్‌ఫ్లూ టీకా ఆవిష్కరణ

Nov 21 2026 4:17 AM | Updated on Nov 21 2026 4:17 AM

India Indigenous H5n1 Bird Flu Vaccine

వాక్సిన్‌ను చూపిస్తున్న కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌

అందుబాటులోకి వచ్చిన ‘హెచ్‌5ఎన్‌1’వ్యాక్సిన్‌

ఇది గొప్ప విజయమన్న కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

 

భోపాల్‌: బర్డ్‌ఫ్లూ వ్యాధి నుంచి కోళ్లను రక్షించడానికి దేశీయ టీకా అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి టీకా ‘హెచ్‌5ఎన్‌1’ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శుక్రవారం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఆవిష్కరించారు. భోపాల్‌లోని ‘ఐసీఏఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌’ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.

అత్యంత వ్యాధి కారక ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా(హెచ్‌పీఏఐ)కు చెందిన హెచ్‌5ఎన్‌1 వైరస్‌ (క్లేడ్‌ 2.3.2.1ఏ)పై మన దేశం అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్‌ ఇదేనని తెలిపారు. సాధారణంగా బర్డ్‌ ఫ్లూ అని పిలిచే హెచ్‌పీఏఐ కోళ్లు, ఇతర పక్షులకు సోకే ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రబలినప్పుడు ప్రభావిత పక్షుల్లో దాదాపు 100 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉంది.  బర్డ్‌ ఫ్లూ నివారణ, పశు ఆరోగ్య పరిరక్షణ రంగంలో స్వదేశీ వ్యాక్సిన్‌ను తీసుకురావడం గొప్ప విజయమని మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పారు.

ఈ వ్యాక్సిన్‌ భారతదేశ స్వయం సమృద్ధికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోందన్నారు. బర్డ్‌ ఫ్లూ వల్ల ప్రతిఏటా కోళ్లు చనిపోవడమే కాకుండా పౌల్ట్రీ రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ స్వదేశీ వ్యాక్సిన్‌ మన దేశంలో బర్డ్‌ ఫ్లూ నియంత్రణను బలోపేతం చేయడంతో పాటు కోళ్లకు రక్షణ కల్పింస్తుందని వెల్లడించారు.

2006 నుంచి దేశంలో హెచ్‌5ఎన్‌1, హెచ్‌5ఎన్‌8 వైరస్‌ల వ్యాప్తికి సంబంధించి 500కు పైగా ఘటనలు నమోదయ్యాయని పేర్కొన్నారు. హెచ్‌5ఎన్‌1 వైరస్‌ నియంత్రణకు దేశీయంగా టీకాను తీసుకురావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, బర్డ్‌ ఫ్లూకు వ్యతిరేకంగా స్వదేశీ టీకాను అభివృద్ధి చేయడం ద్వారా భారత్‌ తన శాస్త్రీయ సామర్థ్యాలను నిరూపించుకుందని చౌహాన్‌ స్పష్టంచేశారు.

విదేశాలకు వెళ్లి మన దేశ రాజ్యాంగ సంస్థల సామర్థ్యాలను, శాస్త్రవేత్తలను, సైన్యాన్ని ప్రశ్నించేవారు భారత్‌ సాధించిన విజయాలను చూడాలని పరోక్షంగా రాహుల్‌ గాందీకి సూచించారు. పశుసంవర్ధక రంగాన్ని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అభివర్ణించారు. పాడి పశువులు, జంతువులు రైతులకు సంచార ఏటీఎంల లాంటివని, అవి వ్యవసాయంతో పాటు స్థిరమైన ఆదాయ వనరును అందిస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వైఫల్యాలను మోదీ అంగీకరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement