ఆంధ్ర మూడో విజయం
న్యూ చండీగఢ్: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్ జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 70 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో ఆంధ్ర జట్టుకిది మూడో విజయం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), షేక్ రషీద్ (42 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్), హేమంత్ రెడ్డి (34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ 18.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సత్యనారాయణ రాజు 14 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి మధ్యప్రదేశ్‌ను దెబ్బ తీశాడు. నరసింహ రాజు, యశ్వంత్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు కోల్‌కతాలో హైదరాబాద్, గోవా జట్ల మధ్య గ్రూప్ ‘డి’ నాలుగో లీగ్ మ్యాచ్ వర్షం కారణ ంగా రద్దయింది.


