కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–12, 13–21, 21–16తో హు కె యున్–లిన్ జియాంగ్ యీ (చైనా) ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్ లక్ష్యసేన్ 21–17, 10–21, 21–13తో ప్రపంచ మాజీ చాంపియన్ లోహ్ కీన్ యే (సింగపూర్)పై నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 7–21తో వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు.
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ రక్షిత శ్రీ 19–21, 16–21తో చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై సంచలన విజయం సాధించిన రక్షిత అదే జోరును కొనసాగించలేకపోయింది. నేడు జరిగే డబుల్స్ సెమీఫైనల్లో మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్... సింగిల్స్ సెమీఫైనల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ ఆడతారు.


