ప్రపంచ 15వ ర్యాంకర్ కోకి వతనాబెపై శ్రీకాంత్ విజయం
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ అద్భుత విజయాలు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ తొలి రౌండ్‌లో 21–16, 16–21, 21–9తో ప్రపంచ 15వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ నిర్ణాయక మూడో గేమ్‌లో 12–9 స్కోరు వద్ద ఒక్కసారిగా చెలరేగి వరుసగా 9 పాయింట్లు సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు.
ఈ గెలుపుతో గతవారం జపాన్ మాస్టర్స్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో వతనాబె చేతిలో ఎదురైన ఓటమికి శ్రీకాంత్ బదులు తీర్చుకున్నాడు. ఈ ఓటమితో వతనాబె బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రపంచ 47వ ర్యాంకర్ అర్నాడ్ మెర్కెల్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 14–21, 21–16, 25–23తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ నిర్ణాయక మూడో గేమ్‌లో ఐదో ప్రయత్నంలో గేమ్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో లక్ష్య సేన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు 2021 తర్వాత అర్హత సాధించాడు.
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–16, 21–9తో ఫాన్ కా యాన్–లెయుంగ్ యుయెట్ యుయీ (హాంకాంగ్) జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అషి్మత 12–21, 21–13, 21–12తో ఇషారాణి బారువా (భారత్)పై, రక్షిత శ్రీ 21–18, 21–18తో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై గెలిచారు. ఉన్నతి హుడా 21–17, 19–21, 17–21తో హాన్ యువె (చైనా) చేతిలో, అన్‌మోల్ 10–21, 18–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓడిపోయారు.


