భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అర్హతపై అనిశ్చితి
నేటి నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
తెల్లవారుజామున గం. 3:30 నుంచి 10:30 వరకు సోనీ స్పోర్ట్స్ చానెల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
వెలింగ్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్ రెండుసార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌గానే నిలిచింది. 2025లో తుది పోరుకు అర్హత సాధించలేకపోయిన టీమిండియా ... ఇప్పుడు 2027లో ఫైనల్ చేరేందుకు తీవ్రంగా ప్రయతి్నస్తోంది. ప్రస్తుతం శుబ్‌మన్ గిల్ బృందం డబ్ల్యూటీసీ పట్టికలో 51.52 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. జట్టు మరో 7 టెస్టులు ఆడాల్సి ఉంది. తాజా పరిస్థితిని చూస్తే పూర్తిగా రేసు నుంచి తప్పుకోకపోయినా... అన్ని టెస్టులూ గెలిచినా సరే ఫైనల్లో స్థానం ఖాయం మాత్రం కాదు. దానికి పలు సమీకరణాలు ఆధార పడి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టు జట్టుకు కీలకం కానుంది. ఈ సిరీస్‌లో రెండు టెస్టులతో పాటు స్వదేశంలో ఆ్రస్టేలియాతో ఆడనుండటం భారత్‌కు పెద్ద సానుకూలాంశం. ప్రస్తుత ఫామ్, ఆసీస్ బ్యాటింగ్ బృందం పరిస్థితి, స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబాటును చూస్తే భారత్ క్లీన్‌స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదు. అయితే దానికి ముందు కివీస్ రూపంలో సవాల్ నిలిచి ఉంది. సొంతగడ్డపై కంగారూలపై పోరుకు ముందు ఈ రెండు టెస్టుల్లో భారత్ గెలవడం తప్పనిసరి. ఆ తర్వాతే ఆసీస్‌తో పోరు గురించి ఆలోచించవచ్చు!
న్యూజిలాండ్‌తో రెండు, ఆ్రస్టేలియాతో ఐదు టెస్టులు కూడా గెలిస్తే భారత్ ఖాతాలో గరిష్టంగా 70.37 పాయింట్ల శాతం ఉంటుంది. ఆరు గెలిచి ఒకటి ‘డ్రా’ అయితే 66.67 శాతం, ఆరు గెలిచి ఒకటి ఓడితే 64.81తో ముగించవచ్చు. వీటిలో ఏది మారినా పూర్తిగా అవకాశాలు కోల్పోయినట్లే. పైగా స్లో రన్‌రేట్‌తో పాయింట్లు కోల్పోరాదనే షరతు కూడా ఇక్కడ కీలకం. కాబట్టి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేదు. అయితే ఇప్పటికే చాన్స్ కోల్పోయిన జట్లతో కాకుండా రేసులో ఉన్న టీమ్‌లతో తలపడుతోంది కాబట్టి మన విజయాల ప్రభావం ఆ రెండు జట్లపై కూడా ఉంటుంది.
భారత్ గెలిస్తే ఆసీస్, కివీస్ తమ పాయింట్లు కోల్పోయినట్లే. 2015లో కోహ్లి పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారిన తర్వాతి నుంచి ఒక్క న్యూజిలాండ్‌తో మినహా మిగిలిన అన్ని టెస్టు జట్లపై భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. ఒక్క కివీస్‌తోనే ఆడిన 11 టెస్టుల్లో భారత్ 4 గెలిచి, 7 ఓడింది. ఈ స్థితిలో నేటి నుంచి జరిగే టెస్టులో భారత్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరం. భారత టాప్–6 బ్యాటర్లలో ఒక్క పంత్‌కు మాత్రమే న్యూజిలాండ్ గడ్డపై 2 టెస్టులు ఆడిన అనుభవం ఉండగా... జైస్వాల్, పడిక్కల్, గిల్, జురేల్, సాయి సుదర్శన్ ఒక్క టెస్టు కూడా ఇక్కడ ఆడలేదు. హెన్రీ, డఫీ, జేమీసన్‌ల పదునైన బౌలింగ్‌ను వీరు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి.
20 వికెట్లు తీయగల సత్తా ఉంది: మోర్కెల్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత తుది జట్టులో పేస్ బౌలర్లు ఎవరు ఉంటారనేది ముఖ్యం కాదని, తమకు మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని పేస్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. ఎవరు ఆడినా 20 ప్రత్యర్థి వికెట్లు పడగొట్టగల బృందం తమకు ఉందని అతను చెప్పాడు. వెలింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో తీవ్ర వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా బౌలర్లు శ్రమించాల్సి ఉంటుందని మోర్కెల్ చెప్పాడు.
బుమ్రాకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా... అతను రెండు రోజుల పాటు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాడని కోచ్ వెల్లడించాడు. ‘భారత జట్టులో పదునైన, సమర్థులైన పేసర్లు ఉన్నారు. ఎవరిని ఆడించినా వారంతా కలిసి 20 వికెట్లు తీయగల సత్తా ఉంది. ఇదే విషయాన్ని నేను గంభీర్‌కు కూడా చెప్పాను. నా దృష్టిలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసి బుమ్రా టెస్టు కోసం సన్నద్ధమయ్యాడు’ అని మోర్కెల్ స్పష్టం చేశాడు.
25 న్యూజిలాండ్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 25 టెస్టులు జరిగాయి. 5 టెస్టుల్లో భారత్, 10 టెస్టుల్లో న్యూజిలాండ్ గెలిచాయి. 10 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. న్యూజిలాండ్‌లో ఇరు జట్ల మధ్య 10 ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు జరిగాయి. రెండుసార్లు (1968, 2009) భారత్... ఆరుసార్లు (1981, 1990, 1998, 2002, 2014, 2020) న్యూజిలాండ్ సిరీస్‌ను గెల్చుకున్నాయి. రెండు సిరీస్‌లు ‘డ్రా’ అయ్యాయి.


