విశ్లేషణ
మనీలాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు, క్వాడ్ దేశాధినేతల సమావేశం, చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న అపెక్ (ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కోఆపరే షన్) శిఖరాగ్ర సదస్సు, డిసెంబర్ 14, 15న జరగనున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు ప్రపంచ రాజకీయాల గమన దిశపై కొంత స్పష్టతనిచ్చే అవకాశం కన్పిస్తోంది.1989లో ప్రారంభమైన అపెక్‌లో 21 దేశాలకు ప్రాతినిధ్యం ఉన్నది. తైవాన్, హాంకాంగ్, చైనాకు ప్రాతినిధ్యం కలిగిన ఏకైన వేదిక అపెక్. ప్రపంచ ఉత్పత్తిలో అపెక్ వాటా 60 శాతం.
అమెరికా, చైనా, రష్యా మూడింటికీ ప్రాతినిధ్యం కలిగిన అరుదైన వేదిక అపెక్. అయితే ఏ రకమైన ఒప్పందాలు, నియమాలు, వివాద పరిష్కార వ్యవస్థలు లేని కూటమి కాని కూటమి అపెక్. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలను సరళీకృతం చేయటా నికి అభిప్రాయాలు పంచుకొని, సమన్వయం చేసుకోవటానికి అపెక్ రూపొందించబడింది. బోగోర్‡లక్ష్యాలు (1994), ఒసాకా అజెండా (1995), పుత్రజయ విజన్ (2020) ప్రాతిపదికగా నిర్వహించ బడుతున్న అపెక్ ఒక విలక్షణమైన వేదిక.
కూటమి కాని కూటమి
పసిఫిక్ మహా సముద్రానికి ఇరువైపులా ఉన్న ఆసియా–ఉత్తర/ దక్షిణ అమెరికా ఖండాల దేశాలు సభ్యులుగా ఉన్న అపెక్ వాణిజ్య సుంకాలను తగ్గించటంలో కీలక పాత్ర పోషించింది. కానీ ఆసియా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు అపెక్ స్పందించలేదు. ఆసియా పసిఫిక్ దేశాలు అపెక్‌కు ప్రత్యామ్నాయంగా సమాంతర వ్యవస్థ లను సీపీటీపీపీ(కాంప్రెహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్–పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్), ఆర్‌సీఈపీ (రీజనల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్) రూపంలో ఏర్పాటు చేసుకున్నాయి.
అపెక్ ఏర్పడినప్పుడు ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య పెట్టుబడులకు చైనాను అవరోధంగా అమెరికా అభివర్ణించేది. ఇప్పుడు దారులు తారుమారయ్యాయి. అమెరికా ట్రంప్ నాయ కత్వంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తిలోదకాలిచ్చి సుంకాల యుద్ధానికి తెరతీసింది. వివిధ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకుంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనేజేషన్‌ను నిర్వీర్యం చేసింది. చైనా, రష్యా ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడుతున్నాయి.
కీలక సభ్యులు–సమస్యలు
షెన్‌జెన్‌లో జరుగుతున్న అపెక్ సదస్సు కంటే ఈ పార్శ్వంలో జరుగుతున్న ట్రంప్–పుతిన్–జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశంపైనేఅందరి ఆసక్తి నెలకొని ఉన్నది. ప్రపంచాన్ని ప్రస్తుతం కుదిపేస్తున్న అంతర్జాతీయ సంఘటనలకు వీరు ముగ్గురే బాధ్యులు లేదా భాగస్వాములు లేదా పరిష్కారకర్తలు. ఇరాన్ యుద్ధానికి ట్రంప్ నేరుగా బాధ్యుడు. హార్మూజ్ దిగ్బంధనంలో అత్యధికంగా నష్ట పోతున్నది చైనా, జపాన్, కొరియా, ఇతర అపెక్ దేశాలు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా అపెక్‌లో సభ్యురాలు. ఈరోజు కాకపోతే రేపైనా తెరమీదకు రాక తప్పని అపరిష్కృత వివాదం తైవాన్. ఈ వివాదపు కర్త, కర్మ, క్రియలన్నీ అపెక్‌లో సభ్యులే.ఏదో రకంగా గౌరవ ప్రదంగా ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ మార్గాన్వేషణలో ఉన్నారు. అపెక్ దీనికి మంచి అవకాశం.
మూడవ యుద్ధనౌకను పర్షియన్ సింధు శాఖలోనికి పంపించి ఒకవైపు సాయుధ ఒత్తిడిని కొనసాగిస్తూనే ఇరాన్ మెడలు వంచాలని అమెరికా వ్యూహం. అయితే ఇరాన్‌పై నిజమైన ఒత్తిడి రష్యా–చైనా నుండి రావాలి. అయితే ఈ సందర్భంలో రష్యా, చైనాలు అమెరికా నుండి ఉక్రెయిన్, తైవాన్‌ల విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్‌కు సంబంధించిన చిప్స్ రవాణా విషయాలలో అమెరికానుండి సానుకూల వైఖరిని ఆశిస్తాయి. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం ఎత్తివేస్తే చైనా, జపాన్, కొరియా, భారత్‌లకు లాభం. అయితే, తైవాన్ విషయంలో అమెరికా తలదూర్చకూడదని చైనా షరతు విధిస్తుంది. దీనిని జపాన్–కొరియా, ఆగ్నేయాసియా దేశాలు హర్షించవు. పసిఫిక్‌లో చైనా ఆధిపత్యానికి విరుగుడుగా అమెరికా నౌకాదళాన్ని మోహరించాలని అవి కోరుకుంటాయి.
ఇంధనం విషయంలో ఇరాన్ రాజీపడదు. ఈ విషయంలో రష్యా హామీ ఇస్తే తప్ప ఇరాన్ తన విధానాన్ని మార్చుకోదు. రష్యా హామీ ఇవ్వాలంటే అది ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై ఆంక్షలు, నాటో విస్తరణ, ఐరోపా దేశాలతో వైరంతో ముడిపడి ఉన్నది. ఉక్రెయిన్‌లో తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాలపై రష్యా రాజీ పడదు. నాటో విస్తరణను ఆపి వేస్తున్నట్లు అమెరికా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబడుతుంది. దీనికి ఉక్రెయిన్, యూరప్ దేశాలు అంగీకరించవు.మధ్యంతర ఎన్నికల్లో అమెరికన్ కాంగ్రెస్‌లో మెజారిటీ సాధించిన డెమోక్రటిక్ పార్టీ, చైనాతో మెతక వైఖరికి ఒప్పుకోదు. అమెరి కన్ డెమోక్రాట్లు ఉక్రెయిన్‌కు గట్టి మద్దతునిస్తారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనా, రష్యాల విషయంలో స్నేహపూరిత, మెతక వైఖరిని అవలంబిస్తాడా అనేది సందేహాస్పదం.
ఇండియా ఏం చేయాలి?
మనీలాలో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సు పరోక్షంగా చైనాకు హెచ్చరిక. 2024 తరువాత క్వాడ్ సదస్సుకు ట్రంప్ హాజరుకాలేదు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లతో కూడిన క్వాడ్‌ను ఒకప్పుడు ఏషియన్ నాటోగా భావించారు. పసిఫిక్ మహాసముద్రంలో క్వాడ్‌ను చైనాకు ‘చెక్’గా చూశారు. ట్రంప్ గత రెండు సంవత్సరాలుగా చైనాకు దగ్గరవటానికి క్వాడ్‌ను వ్యూహాత్మకంగా అలక్ష్యం చేశాడు. మనీలాలో క్వాడ్ సదస్సుకు హాజరవటం ద్వారా చైనాకు పరోక్షంగా సందేశమిచ్చి నట్లయింది. జిన్‌పింగ్‌తో సమా వేశంలో ట్రంప్ క్వాడ్‌ను తురుపు ముక్కగా వాడుకోవచ్చును.
యూరప్‌లో రష్యా ఆధిపత్యానికి స్థూలంగా అమెరికా అంగీక రిస్తూ నాటో విస్తరణను శాశ్వతంగా ఆపివేసి, ఉక్రెయిన్ విభజనకు ట్రంప్ అంగీకరిస్తే పుతిన్ యుద్ధాన్ని ఆపి ఇరాన్‌పై ఒత్తిడి తేవచ్చు. ఇరాన్‌లోని అణు ఇంధ నాన్ని రష్యా నియంత్రణలో ఉంచవచ్చు. రష్యా, ఇరాన్‌లపై పూర్తిగా ఆంక్షలను ఎత్తివేసి హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవవచ్చును. తైవాన్ విషయంలో ట్రంప్ రాజీకి అంగీకరిస్తే చైనా కూడా ఇరాన్ యుద్ధ పరిసమాప్తికి సహకరిస్తుంది.
ట్రంప్–పుతిన్–జిన్‌పింగ్ మధ్య రాజీ భారత్‌ను సంకట పరి స్థితిలోనికి నెట్టివేస్తుంది. అమెరికా, రష్యా మధ్య స్వతంత్రంగా వ్యవహరిస్తూ వ్యూహాత్మకంగా లాభపడుతున్న భారత్‌కు ఈ ప్రయో జనాలు దూరమవుతాయి. అమెరికా–చైనా దగ్గరయితే చైనాకు ప్రత్యామ్నాయంగా పాశ్చాత్య దేశాలకు భారత్ వాణిజ్య పెట్టు బడుల గమ్యస్థానంగా ఉండే అవకాశాలు క్షీణిస్తాయి. బ్రిక్స్, జీ–20ల ద్వారా భారత్‌కు అంతర్జాతీయంగా ఉన్న ప్రాధాన్యత మసకబారుతుంది. అమెరికా–చైనా–రష్యా రాజీ ఇప్పటికిప్పుడు సాధ్యం కానప్పటికీ, ఈ రకమైన రాజకీయ పునరేకీకరణకు భారత్ సిద్ధంగా ఉండాలి. యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియా, కెనడా, బ్రెజిల్, దక్షిణ కొరియా వంటి దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య, వ్యూహాత్మక ఒప్పందాల్ని బలోపేతం చేయటంపై దృష్టి సారించాలి.
అంతర్జాతీయంగా ప్రధాన రాజకీయ శక్తుల పునర్వ్యవస్థీకరణకు అపెక్ శిఖరాగ్ర సమావేశం (షెన్‌జెన్, చైనా)లో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ శ్రీకారం చుట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు
-గురజాల శ్రీనివాసరావు


