ఇండో–పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి వీల్లేదు
తేల్చిచెప్పిన ‘క్వాడ్’ దేశాల అధినేతలు
సహకారాన్ని బలోపేతం చేయడానికి నూతన కార్యక్రమాలు
వచ్చే ఏడాది క్వాడ్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్ భేటీ
క్వాడ్ భారత్‌కు ఒక నిర్మాణాత్మక, విశ్వసనీయ భాగస్వామి: మోదీ
మనీలా: ఇండో–పసిఫిక్‌లో సహకారాన్ని బలోపేతం చేయడానికి సముద్ర నిఘా వ్యవస్థ, సైనిక విన్యాసాలు, కేబుల్ కనెక్టివిటీ ఫ్రేమ్‌వర్క్, సైబర్ సెక్యూరిటీ భాగస్వామ్యం సహా పలు నూతన కార్యక్రమాలను ‘క్వాడ్’కూటమి నాయకులు ఆవిష్కరించారు. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి సాగించే ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకపక్ష ఎగుమతి ఆంక్షలతో సహా బలవంతపు ఆర్థిక చర్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
పరోక్షంగా చైనా అతివాద ధోరణిని ఆక్షేపించారు. ఇండో–పసిఫిక్‌లో బహిరంగ, సురక్షిత, సుదృఢమైన సముద్ర రవాణా కారిడార్ల కోసం కలిసి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. మంగళవారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నాలుగు దేశాల ‘క్వాడ్’శిఖరాగ్ర సదస్సు జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనే తకాయిచీ హాజరయ్యారు.
సదస్సు అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇండో–పసిఫిక్‌లో కీలకమైన సప్లై చైన్లను సురక్షితంగా మారుస్తున్నామని, నౌకాయానం, విమానయాన స్వేచ్ఛను పరిరక్షిస్తున్నామని ఉద్ఘాటించారు. విశ్వసనీయమైన కృత్రిమ మేధ(ఏఐ)లో పెట్టుబడులు, విస్తరణతో సహా భవిష్యత్ సాంకేతికతల ద్వారా వృద్ధిని సాధిస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి, స్పష్టమైన ప్రయోజనాలను చేకూర్చే అవకాశాలను పెంపొందించడానికి ప్రాంతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.
‘క్వాడ్’నూతన కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాది ఆరంభంలో ‘క్వాడ్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్’భేటీ నిర్వహించనున్నారు. క్వాడ్ దేశాల వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, విధాన నిపుణులను ఒకచోట చేర్చి, వారి మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ ఫోరమ్ ఉద్దేశం. సమాచార మార్పిడి, సముద్ర రంగ అవగాహనను పెంపొందించే కొత్త కార్యక్రమం ‘ఇండో–పసిఫిక్ సముద్ర నిఘా సహకారాన్ని’క్వాడ్ దేశాల అధినేతలు స్వాగతించారు. 2027లో పీ–8, పీ–3సీ పెట్రోల్ విమానాలు తొలిసారిగా సముద్ర విన్యాసంలో పాల్గొంటాయి.
విశ్వసనీయ పరిష్కారాలు అందించడమే క్వాడ్ ధ్యేయం: మోదీ
భారతదేశానికి ‘క్వాడ్’ఒక నిర్మాణాత్మక, విశ్వసనీయ భాగస్వామి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇండో–పసిఫిక్‌లో సముద్ర భద్రత, సప్లై చైన్లు, నూతన సాంకేతికతలు, విపత్తు ప్రతిస్పందన వంటి రంగాల్లో విశ్వసనీయ పరిష్కారాలను అందించడానికి క్వాడ్ కృషి చేస్తోందని అన్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. గత ఏడాది జనవరి నుంచి క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఐదుసార్లు సమావేశమయ్యారని వెల్లడించారు.
ఇది తమ రాజకీయ సంకల్పానికి, భాగస్వామ్యం పట్ల ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సము ద్ర భద్రత, విశ్వసనీయ సప్లై చైన్ల వరకు, నూతన సాంకేతికతల నుంచి విపత్తు ప్రతిస్పందన వరకు ఇండో–పసిఫిక్ అంతటా విశ్వసనీయ పరిష్కారాలను అందించడమే క్వాడ్ ధ్యేయమని స్పష్టంచేశారు. ఉమ్మడి సహకారంలోని తదుపరి దశ కోసం నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు.
కొత్త ఏఐ యాక్సిలరేటర్: ట్రంప్
క్వాడ్ దేశాలు ఒక కొత్త ‘క్వాడ్ ఏఐ యాక్సిలరేటర్’ను ప్రారంభించడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇండో–పసిఫిక్‌లో విశ్వసనీయమైన ఏఐ ఆవరణ వ్యవస్థలను విస్తరించడానికి 85 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. కీలక సాంకేతికతల భవిష్యత్తుపై మన విలువలను, ఉమ్మడి ప్రయోజనాలను పంచుకునే దేశాల ఆధిపత్యం ఉండాలని చెప్పారు.
క్వాడ్ కూటమి సభ్య దేశాల మధ్య ఆర్థిక భద్రతను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరికొన్ని కొత్త క్వాడ్ కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. మన ఆర్థిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు తొలిసారిగా క్వాడ్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. కీలకమైన ఖనిజ ఒప్పందాలను కుదుర్చుకున్నామని వెల్లడించారు. మన సప్లై చైన్లను సురక్షితంగా మార్చుకోవడానికి చర్యలు చేపట్టామన్నారు.
మోదీ మహా ఘటికుడు: ట్రంప్
మనీలా: భారత ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న క్వాడ్ సమావేశాల సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మోదీ మహా ఘటికుడు. గొప్ప నేత. నాకు మంచి మిత్రుడు’’అని కొనియాడారు. 2025 ఫిబ్రవరిలో భార త్ అమెరికా వాణిజ్య ఒప్పందం చ ర్చల సందర్భంగా కూడా ట్రంప్... బేరాసారాలు ఆడటంలో మోదీ తనకంటే గట్టివాడని అన్న విషయం తెలిసిందే.
త్రివర్ణ పతాకానికి మోదీ గౌరవం!
మనీలా: మనీలా క్వాడ్ సదస్సులో మంగళవారం ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఇది చిన్నదైనప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్, అమెరికా, జపాన్, ఆ్రస్టేలియా దేశాధినేతల ఫొటో సెషన్ ఏర్పాట్లలో భాగంగా వేదికపై కొన్ని మార్కర్లు ఏర్పాటు చేశారు. ఎవరు ఎక్కడ నుంచోవాలో సూచిస్తూ ఆయా దేశాల చిన్నసైజు పతాకాలను గుర్తుగా పెట్టారు.
మిగిలిన దేశాధినేతలు ఒక్కరొక్కరుగా తమ స్థానాల్లో నిలుచుకునే పనిలో ఉండగా మోదీ దృష్టి నేలపై అతికించి ఉంచిన త్రివర్ణ పతాకంపై పడింది. దాన్ని అలాగే వదిలేయకుండా.. కిందకు వంగి అక్కడి నుంచి తొలగించి.. తన జేబులో ఉంచుకున్నారు. దీన్ని గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ‘‘సేవ్ ఇట్’’అని క్లుప్తంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. మోదీ చేసిన ఈ పని జాతీయ జెండాకు ఆయన చూపిన గౌరవమని సోషల్ మీడియాలో పలువురు ప్రశంసించారు. 2023లో బ్రిక్స్ సదస్సు సందర్భంగానూ జొహానెస్‌బర్గ్‌లో మోదీ వేదికపై ఉన్న భారత జెండా మార్కర్‌ను ఇలాగే జేబులో పెట్టుకున్న విషయం తెలిసిందే.


