వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని వాషింగ్టన్‌లో డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏడుగురు అమెరికా అధికారులు చెప్పిన వివరాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
అమెరికా రాజధానిలోని నిర్దిష్ట ప్రాంతాలు, లక్ష్యాలను గుర్తిస్తూ ఇరాన్ ఈ ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. అయితే ఇది తక్షణ దాడికి సంకేతం కాదని, భవిష్యత్తులో అవసరమైతే ఉపయోగించుకునేందుకు ఇరాన్ తన అవకాశాలను పరిశీలిస్తోందని అధికారులు పేర్కొన్నారు. దాడి జరుగుతుందనే స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ వెల్లడించారు.
మరోవైపు ఇరాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం చేసే ఉద్దేశం అమెరికాకు లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమం అమెరికాకు ముప్పుగా మారిందన్నారు. అయితే ఈ యుద్ధం పదేళ్లు, పదిహేనేళ్లు కొనసాగదని, కనీసం రెండేళ్లపాటు కూడా అమెరికా సైనిక నిబద్ధత ఉండబోదని పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఈ సంఘర్షణకు అనుకూల ఫలితాలతో ముగింపు పలుకుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఇరాన్ అనుకూల సాయుధ సంస్థ కతాయిబ్ హెజ్బొల్లా ఆధిపత్యంలో ఉన్న జుర్ఫ్ అల్ నస్ర్ పట్టణంలోకి సైన్యాన్ని పంపాలని ఇరాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ చమురు రవాణాపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ప్రధాని అలీ అల్-జైదీ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతం నుంచి సాయుధ సంస్థ వెనక్కి వెళ్లేందుకు గడువు విధించారు. బాగ్దాద్‌కు దక్షిణాన ఉన్న ఈ పట్టణాన్ని గతంలో జుర్ఫ్ అల్-సఖర్‌గా పిలిచేవారు. శుక్రవారంలోగా ప్రాంతాన్ని విడిచిపెట్టాలని కతాయిబ్ హెజ్బొల్లాకు గడువు విధించినట్లు ఇరాక్ అధికారి అల్‌జజీరాకు తెలిపారు. పట్టణం చుట్టూ అదనపు బలగాలను మోహరించాలని, ప్రభుత్వ సైన్యం ప్రవేశానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీంతో ఇరాక్ సైన్యానికి, సాయుధ సంస్థకు మధ్య ప్రత్యక్ష ఘర్షణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రాంతం నుంచి చమురు ట్యాంకర్లు, పెట్రోలియం ఉత్పత్తుల వాహనాలు బయటకు వెళ్లకుండా భద్రతా సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. అక్రమ చమురు శుద్ధి కేంద్రాలపై దర్యాప్తులో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలని అమెరికా, గల్ఫ్ మిత్రదేశాల నుంచి ఇరాక్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే చమురు పైప్‌లైన్లలో ఎలాంటి అక్రమాలు గుర్తించలేదని కతాయిబ్ హెజ్బొల్లా ఆరోపణలను ఖండించింది.
ఇదీ చదవండి: ‘నీట్’లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ?


