ముగ్గురు నేతల మొట్టమొదటి త్రైపాక్షిక సమావేశం
షెన్‌జెన్‌లో కిమ్‌నూ కలిసే అవకాశముందన్న ట్రంప్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన చైనాలోని షెన్‌జెన్‌లో జరిగే 33వ ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్) శిఖరాగ్రంలో మొట్టమొదటి సారిగా ముగ్గురూ ఒకే చోట కలుసుకోనున్నారు. ఈ సమావేశం చారిత్రక సందర్భంగా మిగిలిపోనుందని చైనా సోమవారం వ్యాఖ్యానించింది.
అమెరికా, రష్యా, చైనాలు ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్య దేశాలు మాత్రమే కాదు, భద్రతా మండలిలో శక్తివంతమైన వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్య దేశాలు కూడా. మొత్తం 21 సభ్య దేశాల నేతలు పాల్గొనే ఈ సమావేశంలో కృత్రిమ మేధ (ఏఐ), అణ్వాయుధాల తగ్గింపు వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాల్లేవని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. షెన్‌జెన్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌తోనూ సమావేశమయ్యేందుకు అవకాశముందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.


