ఊపందుకుంటున్న విద్యుత్‌ విమానాల తయారీ | China flies 19 seater electric aircraft for first time countries E flights Details | Sakshi
Sakshi News home page

చైనా ఇ- విమానం ప్రయోగం విజయవంతం

Nov 16 2026 6:30 PM | Updated on Nov 16 2026 6:34 PM

China flies 19 seater electric aircraft for first time countries E flights Details

ఒకప్పుడు రోడ్లపై పెట్రోల్, డీజిల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ కార్లు వస్తాయని ఎవరూ పెద్దగా ఊహించలేదు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇదే విప్లవం ఇప్పుడు విమానయాన రంగానికీ విస్తరిస్తోంది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ వంటి సంప్రదాయ ఇంధనాలకు బదులుగా బ్యాటరీల్లో నిల్వ చేసిన విద్యుత్‌తో విమానాలను నడిపించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తాజాగా చైనా 19 మంది సామర్థ్యం కలిగిన విద్యుత్‌ విమానాన్ని విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ విమానయానం మరోసారి చర్చలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో చూద్దామా?

వెలిస్‌ ఎలక్ట్రో.. ఫస్ట్‌ ఇదే 
స్లోవేనియాకు చెందిన పిపిస్ట్రెల్‌ సంస్థ రూపొందించిన ‘వెలిస్‌ ఎలక్ట్రో’ ప్రపంచ విద్యుత్‌ విమానయాన చరిత్రలో తొలి ప్రయోగం. 2020 జూన్‌లో యూరోపియన్‌ యూనియన్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్‌ఏ) నుంచి టైప్‌ సరి్టఫికేషన్‌ పొందిన తొలి పూర్తిస్థాయి విద్యుత్‌ విమానంగా ఇది గుర్తింపు పొందింది. ఇద్దరు ప్రయాణించగలిగే ఈ చిన్న విమానాన్ని ప్రధానంగా పైలట్‌ శిక్షణ కోసం రూపొందించారు. గరిష్ఠంగా 56 నిమిషాల పాటు ప్రయాణించగలదు.

నాలుగు సీట్ల విమానంతో చైనా.. 
షెన్యాంగ్‌ ఏరోస్పేస్‌ యూనివర్సిటీకి చెందిన లియానింగ్‌ జనరల్‌ ఏవియేషన్‌ అకాడమీ రూపొందించిన ఆర్‌ఎక్స్‌4ఈ అనే నాలుగు సీట్ల విద్యుత్‌ విమానం 2025 జనవరిలో చైనా పౌర విమానయాన సంస్థ నుంచి టైప్‌ సర్టిఫికేషన్‌ పొందింది. ఇందులో 70 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యమున్న లిథియం బ్యాటరీని ఉపయోగించారు. గరిష్ఠంగా గంటన్నర వరకు ప్రయాణించగలదు. పైలట్‌ శిక్షణ, పర్యాటకుల విహార ప్రయాణాలు, ఏరియల్‌ ఫొటోగ్రఫీ, వైమానిక సర్వేలు వంటి అవసరాలకు ఉపయోగపడేలా రూపొందించారు.

పైలట్‌ లేని ఎయిర్‌ ట్యాక్సీ 
విద్యుత్‌ విమానాల ప్రయోగాల్లో మరో ఆసక్తికరమైన విభాగం ఎలక్ట్రిక్‌ వరి్టకల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌. ఇవి హెలికాప్టర్ల మాదిరిగా నిలువుగా పైకి లేచి, నిలువుగానే కిందికి దిగగలవు. నగరాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ సమయంలో చేరుకునే ఎయిర్‌ ట్యాక్సీలుగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. చైనాకు చెందిన ఈహాంగ్‌ సంస్థ రూపొందించిన ఈహెచ్‌216–ఎస్‌ ఈ విభాగంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇందులో ఇద్దరు ప్రయాణించవచ్చు.  

30 మంది ప్రయాణించే విమానం తయారీకి అమెరికా ప్రయత్నం 
అమెరికాకు చెందిన హార్ట్‌ ఏరోస్పేస్‌ సంస్థ రూపొందించిన ఎక్స్‌1 ప్రయోగాత్మక విమానం 2026 ఆగస్టు 12న తొలిసారిగా గాల్లోకి ఎగిరింది. పూర్తిగా బ్యాటరీతో ఈ ప్రయాణం 27 నిమిషాల పాటు సాగింది. అనంతరం దీని ఆధారంగా 30 మంది ప్రయాణించే సామర్థ్యమున్న ఈఎస్‌–30 ప్రాంతీయ విమానాన్ని అభివృద్ధి చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇందులో హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అంటే విద్యుత్‌ వ్యవస్థతో పాటు సంప్రదాయ ఇంధన ఆధారిత వ్యవస్థ కూడా ఉంటుంది.  

చైనా.. తొలిసారి పైలట్లతో గగనతలంలోకి.. 
చైనాకు చెందిన ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ) సీఈ–25ఏ విమా­నాన్ని అభివృద్ధి చేసింది. శనివారం తూర్పు చైనాలోని షాండాంగ్‌ ప్రావిన్స్‌లో ఉన్న బిన్‌జౌలో ఈ విమానానికి తొలి పైలట్‌ సహిత ప్రయోగాత్మక ప్రయాణం నిర్వహించారు. ఇందులో ఇద్దరు పైలట్లతో పాటు ఒక ఫ్లైట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ ప్రయాణించారు. 

16 నిమిషాల 38 సెకన్లపాటు గాలిలో ఎగిరిన ఈ విమానం.. 60.4 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ విమానంలో 19 మంది ప్రయాణించే వీలుంది. స్వల్ప దూర నగరాల మధ్య విమాన ప్రయాణాలకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ఈ ఏడా­ది ఫిబ్రవరి 2న ఇదే విమానం తొలిసారిగా పైలట్‌ లేకుండా ప్రయా­ణాన్ని పూర్తి చేసింది.తాజాగా పైలట్లతో ప్రయాణం విజయవంతం కావడం దీని అభివృద్ధిలో మరో కీలక దశగా భావిస్తున్నారు. 

విద్యుత్ విమానాల వల్ల ప్రయోజనాలేంటి? 
ఎలక్ట్రిక్‌ మోటార్లు సాధారణంగా సంప్రదాయ జెట్‌ ఇంజిన్ల కంటే తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. విద్యుత్‌ మోటార్లు సంప్రదాయ ఇంజిన్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. దీంతో కొన్ని నిర్వహణ ఖర్చులు తగ్గవచ్చు. విమానం ప్రయాణించే సమయంలో బ్యాటరీ విద్యుత్‌తో నడిచే మోడళ్ల నుంచి నేరుగా ఇంధన దహన ఉద్గారాలు వెలువడవు. తక్కువ దూరాల్లోని నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణాలకు చిన్న విద్యుత్‌ విమానాలు ఉపయోగపడే అవకాశం ఉంది.

సవాళ్లు ఎక్కువే.. 
విద్యుత్‌ విమానయానానికి ప్రధాన అడ్డంకి బ్యాటరీ సాంకేతికత. విమానాలు గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే అధిక శక్తి నిల్వ సామర్థ్యం అవసరం. కానీ ప్రస్తుతం అధిక సామర్థ్యమున్న బ్యాటరీలు కూడా విమానానికి అదనపు బరువును కలిగిస్తున్నాయి. బ్యాటరీ బరువు పెరిగితే ప్రయాణికులు, సరుకు తీసుకెళ్లే సామర్థ్యం తగ్గుతుంది. ఛార్జింగ్‌కు పట్టే సమయం, బ్యాటరీ జీవితకాలం, అత్యవసర పరిస్థితుల్లో భద్రత వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. అందుకే ప్రస్తుతం చిన్న విమానాలు, స్వల్ప దూర ప్రయాణాలు, పైలట్‌ శిక్షణ, ఎయిర్‌ ట్యాక్సీలుగా మాత్రమే ఉపయోగపడతాయి. పెద్ద విమానాల తరహాలో వందల మంది ప్రయాణికులను వేల కిలోమీటర్ల దూరం తీసుకెళ్లే పూర్తిస్థాయి విద్యుత్‌ విమానాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement