‘భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలా?’.. మెలోనీ మిత్రపక్షం ఫైర్‌! | India on democracy Meloni ally slams Italian leader | Sakshi
Sakshi News home page

‘భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలా?’.. మెలోనీ మిత్రపక్షం ఫైర్‌!

Nov 16 2026 11:57 AM | Updated on Nov 16 2026 12:05 PM

India on democracy Meloni ally slams Italian leader

రోమ్‌: భారత ప్రజాస్వామ్యంపై ఇటలీ రాజకీయ నేత జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి చెందిన మిత్రపక్షం ఫోర్జా ఇటాలియా నేత డెబోరా బెర్గామిని ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్న భారత్‌కు యూరోపియన్లు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పడం తగదని స్పష్టం చేశారు.

నవంబర్ 14న హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ 2026లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ ప్రధాన కార్యదర్శి జియాకోమో ఫిలిబెక్.. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ నినాదమైన ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని అంతర్జాతీయ రాజకీయ శక్తులకు పిలుపునిచ్చారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన డెబోరా బెర్గామిని.. భారత్‌కు సొంతంగా రాజకీయ వ్యవస్థలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉన్నాయని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియపై ఎవరైనా ఆరోపణలు చేయవచ్చని, అయితే వాటికి తగిన ఆధారాలు చూపించాలని అన్నారు. మిత్రదేశమైన భారత్ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో ఇతర దేశాల ప్రతినిధులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.

భారత్, ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అన్ని రంగాల్లోనూ ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని బెర్గామిని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంపై వివాదాలు, అభ్యంతరాలను భారతదేశంలోని సంస్థలు, న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. విదేశీ వేదికలపై భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని విమర్శించారు. విదేశీ పర్యటనలు మానుకుని, భారత గ్రామాల్లో పర్యటించాలని, అప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని పుణెలో జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: యూపీ ఎన్నికలు: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement