ఉండాలా? వెళ్ళిపోవాలా?  | Russia attacks on energy and heating infrastructure, creating a deadly situation for civilians | Sakshi
Sakshi News home page

ఉండాలా? వెళ్ళిపోవాలా? 

Nov 16 2026 6:28 AM | Updated on Nov 16 2026 6:28 AM

Russia attacks on energy and heating infrastructure, creating a deadly situation for civilians

ఈ శీతాకాలం ఉక్రేనియన్లకు జీవన్మరణ సమస్య 

విదేశాలు, మధ్య, పశ్చిమ ఉక్రెయిన్‌కు వలసెళ్తున్న సంపన్న వర్గాలు 

చలి నుంచి రక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్న మరికొందరు

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై ఐదేళ్లు కావస్తోంది. యుద్ధ కాలంలో ఈ శీతాకాలం అత్యంత కఠినంగా మారింది. ఇంధన వ్యవస్థలపై రష్యా చేస్తున్న నిరంతర దాడులు, ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణుల కొరత, గడ్డకట్టే చలి ఇక్కడి ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది.  ఉక్రెయిన్‌పై రష్యా మునుపటి కంటే దాడులను తీవ్రం చేసింది. కీవ్‌ నగరం ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆగస్టు 22 నుంచి రాజధానిలో వైమానిక దాడులు లేకుండా ఒక్క రోజు కూడా లేదు. 

దీనికి తోడు పగటిపూట డ్రోన్‌ దాడులు, రాత్రిపూట క్షిపణుల దాడులు కూడా జరుగుతున్నాయి. అత్యంత వేగంగా దూసుకెళ్లే జెట్‌–పవర్డ్‌ డ్రోన్లను రష్యా ప్రయోగిస్తుండటంతో వీటిని అడ్డుకోవడం ఉక్రెయిన్‌ వైమానిక రక్షణ వ్యవస్థలకు కష్టంగా మారింది. అయితే, గతేడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువకు పడిపోవడంతో వేలాది ఇళ్లకు హీటింగ్‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌సరఫరాలో అంతరాయాలతో హీటింగ్‌ లేక కీవ్‌లోని వేలాది మంది ప్రజలు గడ్డకట్టే చలిలో అపార్ట్‌మెంట్లలో ఉండిపోయారు. 

మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని... 
ఉక్రేనియన్ల మనో ధైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, సబ్‌స్టేషన్లు, హీటింగ్‌ వ్యవస్థలపై దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్‌లో రాజధాని కీవ్‌తో సహా పలు నగరాల్లో గంటల తరబడి విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోతోంది. పదేపదే జరుగుతున్న దాడులు, నిరంతర వైమానిక దాడుల హెచ్చరికల వల్ల మరమ్మతులకు చాలా సమయం పడుతోంది. తీవ్రంగా దెబ్బతిన్న ఇంధన వ్యవస్థ దాడులను తట్టుకోవడానికి అంతకంతకూ ఇబ్బంది పడుతోంది. ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండి మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే హెచ్చరించింది. శీతాకాలానికి సరైన సన్నద్ధత లేకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రజలు విమర్శించడం, నగరంలో ర్యాలీలు నిర్వహించడంతో.. ఆగ్రహించిన మేయర్, వెళ్లాలనుకుంటున్న వాళ్లు వెళ్లిపోవచ్చంటూ ఆయన బహిరంగంగానే పిలుపునిచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

సురక్షిత ప్రాంతాలకు తాత్కాలిక వలస.. 
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని స్థితిలో, చాలా మంది రాబోయే నెలలు ఎలా గడపాలా అని ఆలోచిస్తున్నారు. నగరం విడిచి వెళ్లాలా? ఉండాలా? అనే డైలమాలో పడ్డారు. చాలా మంది సంపన్న వర్గాలు దేశంలోని సురక్షిత ప్రాంతాలకు లేదంటే విదేశాలకు తాత్కాలికంగా వెళ్లిపోతున్నారు. దీంతో కీవ్‌లో పెద్ద సంఖ్యలో అద్దె ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. ఇది నవంబర్‌ నాటికి 87 శాతం పెరిగిందంటే ప్రభావం ఏ స్థాయిలో అర్థమవుతోంది. ఆగస్టు 1తో పోలిస్తే నవంబర్‌ 1 నాటికి కీవ్‌లో అద్దెకు అందుబాటులో ఉన్న ఫ్లాట్ల సంఖ్య 87% పెరిగింది. కానీ, ఉక్రెయిన్‌లోని పశ్చిమ నగరాలైన ఉజ్‌హోరోడ్, ల్వివ్, చెరి్నవ్‌స్టీ, ఇవానో–ఫ్రాంకివ్‌స్‌్కతో ఖాళీగా ఉన్న అద్దె ఇళ్ల సంఖ్య తగ్గింది.  

ఖరీదైన వ్యవహారం..  
కానీ, వలస చాలా ఖర్చుతో కూడుకున్నది. అధిక డిమాండ్‌ కారణంగా మధ్య, పశ్చిమ ఉక్రెయిన్‌లో అద్దె ఇళ్ల ధరలు పెరిగిపోయాయి. అద్దె తక్కువగా ఉన్న ఇల్లు దొరకడం కష్టంగా మారింది. భర్తలు యుద్ధరంగంలో ఉండటంతో ఆర్థిక భారమంతా మహిళలపై పడుతోంది. దీంతో, దేశంలోనే ఉంటున్న ప్రజలు జనరేటర్లు, సోలార్‌ ప్యానెల్స్, పవర్‌ బ్యాంకులు, కొవ్వొత్తులు, చిన్న గ్యాస్‌ సిలిండర్లను ముందస్తుగా సమకూర్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చలి నుంచి రక్షించుకుఓవడానికి కట్టెలను పోగేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో... అదనపు వాయు రక్షణ వ్యవస్థలు, ఇంధన మరమ్మతు నిధులు ఇవ్వాలని యూరప్‌ దేశాలను అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుతున్నారు. మరోవైపు, మరమ్మతు బృందాలు దెబ్బతిన్న గ్రిడ్లను పునరుద్ధరించడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement