రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా కీలక ప్రతిపాదన చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పిస్తే.. తూర్పు ప్రాంతంలోని డాన్‌బాస్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటారా? అని అమెరికా ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. అబుదాబిలో ఇటీవల జరిగిన శాంతి చర్చల్లో తొలిసారిగా ఈ అంశాన్ని అమెరికా ప్రస్తావించిందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందించే భద్రతా హామీలపై కూడా చర్చలు జరుగుతున్నాయని జెలెన్‌స్కీ చెప్పారు. నాటో, యూరోపియన్ యూనియన్‌తో చర్చలు పూర్తయి, ఆయా దేశాల నుంచి స్పష్టమైన హామీలు వచ్చిన తర్వాతే ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ ప్రజల అభిప్రాయం తీసుకుంటామని వెల్లడించారు. దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి నిర్ణయాన్ని తాను ఒక్కడినే తీసుకోలేనని ఆయన స్పష్టం చేశారు.
ఇక మరోవైపు యూరప్ భద్రతా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. యూరప్‌కు నిజమైన భద్రత నాటో, యూరోపియన్ యూనియన్ ద్వారానే సాధ్యమని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.
కాగా.. తొమ్మిది నెలల విరామం తర్వాత ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. అయితే డాన్‌బాస్‌తో పాటు మరో మూడు ప్రాంతాలపై నియంత్రణ విషయంలో రష్యా పట్టుబడుతోంది. అయితే తమ భూభాగాలను ఎట్టి పరిస్థితులలో వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: రష్యా జంటకు అమెరికా నుంచి బహిష్కరణ ముప్పు!


