ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం సామాన్య ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉపాధి అవకాశాలు లేక, మెరుగైన భవిష్యత్తు కోసం లక్షలాది మంది దేశం విడిచి వెళ్లిపోతున్నారు. మరోవైపు పాలకులు, ఉన్నతాధికారులు, సైనిక వ్యవస్థకు చెందిన ప్రముఖులు విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకుంటూ, అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
2026 తొలి ఆరు నెలల్లోనే 3.17 లక్షల మందికి పైగా పాకిస్థానీయులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినట్లు పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2024 నుంచి 2026 మధ్య మొత్తం 18.7 లక్షల మందికి పైగా దేశాన్ని వీడినట్లు తెలుస్తున్నది. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఆర్థిక అనిశ్చితి ఇందుకు ప్రధాన కారణాలు.
మరోవైపు పాకిస్థాన్‌లో 2,500 మందికి పైగా పనిచేస్తున్న ఫెడరల్ ప్రభుత్వ అధికారులు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నట్లు అక్టోబర్ 5న వెల్లడైన ఆడిట్ గణాంకాలు వెల్లడించాయి. వందలాది మంది సీనియర్ అధికారులపై విదేశీ ఆస్తులను దాచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడేందుకు ప్రముఖులు పోర్చుగల్‌ను ఎంచుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రభుత్వంలో పనిచేస్తూనే విదేశీ పౌరసత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికారుల తీరుపై రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
ఇదిలా ఉంటే పదవీ విరమణ చేసిన ఎంపీలు, సెనేటర్లకు జీవితాంతం ఉచిత అధికారిక బ్లూ పాస్‌పోర్టులు కల్పించే బిల్లును అక్టోబర్ 19న పాకిస్థాన్ సెనేట్ ఆమోదించింది. సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రజాప్రతినిధులకు ఇలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై చర్చ జరుగుతోంది. పాకిస్థాన్‌లో సైన్యం ఆర్థిక కార్యకలాపాలపై కూడా నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దేశాన్ని రియల్ ఎస్టేట్ సంస్థ తరహాలో నడుపుతోందని, భూములు, ఆస్తులతో పాటు సహజ వనరులపైనా సైనిక వ్యవస్థ ప్రభావం పెరుగుతోందని పేర్కొంది.
ముఖ్యంగా జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వంలోని సైన్యం ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో అరుదైన ఖనిజాలు, కీలక లోహాల తవ్వకాలను వేగవంతం చేస్తోందని ఆరోపించింది. ఎస్‌ఐఎఫ్‌సీ, ఎఫ్‌డబ్ల్యూఓ సంస్థల పాత్రను ప్రస్తావించింది. ఈ తవ్వకాల వల్ల వచ్చే ప్రయోజనాల్లో స్థానికులకు స్వల్ప వాటా మాత్రమే దక్కుతోందని, పర్యావరణ సమస్యలు, అనారోగ్య పరిస్థితులు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. మొత్తంగా పాకిస్థాన్ సంక్షోభం ఆర్థిక రంగానికే పరిమితం కాకుండా పాలన, అవినీతి, అధికార వర్గాల ప్రత్యేక హక్కుల వరకు విస్తరించిందని విశ్లేషించింది.
ఇదీ చదవండి: గంగమ్మ నీరు.. అద్దంలా స్వచ్ఛం.. వీడియో వైరల్!


