హసీనా బంగ్లాకు వెళ్లాలంటే.. భారత్‌ రెండు కండీషన్లు! | India Wants Hasina To Return To Bangladesh After Dhaka Guarantees | Sakshi
Sakshi News home page

హసీనా బంగ్లాకు వెళ్లాలంటే.. భారత్‌ రెండు కండీషన్లు!

Nov 14 2026 10:54 AM | Updated on Nov 14 2026 11:00 AM

India Wants Hasina To Return To Bangladesh After Dhaka Guarantees

రెండేళ్ల క్రితం.. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో పదవీచ్యుతురాలైన అప్పటి ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి భారత్‌కు చేరుకున్నారు. ఢాకాలోని ఆమె నివాసంపై ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు దాడికి దిగడంతో.. బంగ్లాదేశ్‌ సైనిక విమానంలో ఆమె భారత్‌లో అడుగుపెట్టారు. తాజాగా డిసెంబర్‌లో తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. భారత్‌ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

అయితే, అవామీ లీగ్‌ అధినేత్రి భద్రతకు, న్యాయమైన విచారణకు హామీలు లభించిన తర్వాతే ఆమె తిరుగు ప్రయాణం ఉండాలని భారత్‌ కోరుతున్నట్లు బీబీసీ బంగ్లా కథనం వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ, సైనిక వ్యవస్థకు చెందిన పేర్లు వెల్లడించని వర్గాలను ఉటంకిస్తూ ఈ వివరాలను ప్రచురించింది. కాగా, ఈ నివేదికపై శుక్రవారం భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.

సైనిక విమానంలో తీసుకెళ్లాలి:
2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ సైన్యానికి చెందిన విమానంలోనే హసీనా భారత్‌కు చేరుకున్నారు. ఇప్పుడు ఆమెను తిరిగి తీసుకెళ్లే బాధ్యతను కూడా బంగ్లాదేశ్‌ సైన్యమే తీసుకోవాలని భారత్‌ కోరుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఢిల్లీకి సైనిక విమానాన్ని పంపవచ్చు. లేదంటే ఇరు దేశాల మధ్య నిర్ణయించిన సరిహద్దు ప్రాంతంలో బంగ్లాదేశ్‌ సైన్యం ఆమెను స్వీకరించవచ్చు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు కథనం పేర్కొంది.

మరణశిక్షపై అప్పీల్‌..
బంగ్లాదేశ్‌ కోర్టు హసీనాకు ఇప్పటికే మరణశిక్ష విధించింది. 2024లో జరిగిన అణచివేతకు సంబంధించిన ఆరోపణలపై ఆమెకు మళ్లీ న్యాయమైన విచారణ ఎదుర్కొనే అవకాశం కల్పించాలని భారత్‌ కోరుతున్నట్లు సమాచారం. మరణశిక్షపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలని షరతు విధించినట్లు బీబీసీ తెలిపింది. అంతర్జాతీయ సమాజం, ప్రపంచ మీడియా పర్యవేక్షణలో విచారణ జరగాలని భారత్‌ కోరుకుంటున్నట్లు ఓ భారత విదేశాంగ శాఖ అధికారి పేర్కొన్నారని కథనం వెల్లడించింది.

2024 ఆగస్టులో భారీ ప్రజా నిరసనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్‌ హసీనా భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. డిసెంబర్‌లోగా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు  అయితే ఆమెకు అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ 2025 నవంబర్‌లో గైర్హాజరీలో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

2024లో జరిగిన అణచివేతకు సంబంధించిన కేసులో ఆమెకు కొత్తగా విచారణ ఎదుర్కొనే అవకాశం, మరణశిక్షపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించాలన్న హామీలను కూడా భారత్‌ కోరుతోందని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అ అంశంపై ఏదైనా సంప్రదింపులు జరిగాయా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు జైస్వాల్‌ బదులిస్తూ..  ‘‘దీనిపై తాను చెప్పడానికి ఏమీ లేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదని బంగ్లాదేశ్‌ ప్రధాని సహాయ ప్రెస్‌ సెక్రటరీ కేఎం నజ్ముల్‌ హక్‌ శుక్రవారం ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు. బీబీసీ బంగ్లా కథనం వెలువడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, ఫిన్లాండ్‌, అమెరికా, బెలారస్‌, ఖతార్‌.. చివరకు ఆఫ్రికాలోని ఏ ఒక్క దేశం కూడా మారణహోమానికి పాల్పడిన వ్యక్తికి ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా లేదు’’ అంటూ నజ్ముల్‌ పేర్కొన్నారు.

‘మరో మాటలో చెప్పాలంటే.. హసీనాకు ఒక్కో మార్గం మూసుకుపోతోంది. క్షేత్రస్థాయిలోని అవామీ లీగ్‌ కార్యకర్తలు, మద్దతుదారుల రక్తాన్ని ఆసరాగా చేసుకుని చివరి ప్రయత్నంగా ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. నవంబర్‌ 9న హసీనా.. కొత్త పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్‌ ప్రభుత్వంతో ఆమె అధికారికంగా సంబంధాలు ప్రారంభించడం ఇదే తొలిసారి. అయితే, ఢాకా నుంచి స్పందన అంత ప్రోత్సాహకరంగా లేదు. హసీనాను భారత్‌ తమకు అప్పగించాలని కొందరు నేతలు పట్టుబడుతున్నారు. హసీనా పాస్‌పోర్టు అభ్యర్థన విషయంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మరీ కఠినంగా, అసమంజసంగా వ్యవహరిస్తోందని భారత మాజీ దౌత్యవేత్త వీణా సిక్రీ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఎన్విడియా మాజీ సీఈవో వివాదం.. మరో బిగ్‌ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement