హసీనా ప్రకటనతో హైటెన్షన్‌.. బంగ్లాదేశ్‌లో అలజడి! | Bangladesh on Edge as Sheikh Hasina Planned Return Draws Closer | Sakshi
Sakshi News home page

హసీనా ప్రకటనతో హైటెన్షన్‌.. బంగ్లాదేశ్‌లో అలజడి!

Nov 12 2026 10:59 AM | Updated on Nov 12 2026 11:07 AM

Bangladesh on Edge as Sheikh Hasina Planned Return Draws Closer

ఢాకా: ఒకప్పుడు ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన షేక్‌ హసీనా.. ఇప్పుడు మళ్లీ స్వదేశానికి వస్తానంటున్నారు. ఆమె రాకకు డిసెంబర్‌ గడువు దగ్గరపడుతుండగా బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. వీధుల్లో బాంబు పేలుళ్లు.. బస్సులు, వాహనాలకు నిప్పు.. పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణలు.. వరుస ఘటనలతో దేశంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ హింస వెనుక హసీనా పార్టీ అవామీ లీగ్‌ కార్యకర్తల హస్తం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు వేతనాల పెంపు కోసం కార్మికుల నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? హసీనా రీఎంట్రీ ప్రకటనతో ఈ పరిణామాలకు సంబంధం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హసీనా రాక నేపథ్యంలో ప్రస్తుత ఆందోళనలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో అక్టోబర్‌ చివరి నుంచి హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. రాజధాని ఢాకాతో పాటు గాజీపూర్‌, గోపాల్‌గంజ్‌, షరియత్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, వాహనాల దహనాలు చోటుచేసుకున్నాయి. నవంబర్‌ 9, 10 తేదీల్లో దేశవ్యాప్తంగా కనీసం 22 అగ్నిప్రమాదాలు, బాంబు పేలుళ్ల ఘటనలు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నవంబర్‌ 11న ఢాకాలో రెండు బస్సులు, ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. పబ్నాలోని గ్రామీణ బ్యాంకు శాఖను కూడా దగ్ధం చేశారు. తాజాగా నవంబర్‌ 12న నేషనల్‌ సిటిజన్‌ పార్టీ ఎంపీ నుస్రత్‌ తబస్సుమ్‌ ఇంటికి నిప్పు పెట్టారు. అవామీ లీగ్‌ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

అవామీ లీగ్‌ బంద్‌ పిలుపుతో ఉద్రిక్తతలు..
కాగా, బంగ్లాదేశ్‌లో నిషేధిత అవామీ లీగ్‌ విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్‌ ఛాత్ర లీగ్‌ నవంబర్‌ 10న దేశవ్యాప్త దిగ్బంధానికి పిలుపునిచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులపై ఆందోళనలు జరిగాయి. షరియత్‌పూర్‌లో ఢాకా-భంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిరసనకారులు దిగ్బంధించారు. వాహనాలపై దాడులు చేయడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గోపాల్‌గంజ్‌లోనూ పోలీసులతో ఘర్షణలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బోర్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌ బలగాలను రంగంలోకి దించారు.

కార్మికుల ఆందోళనలు..
మరోవైపు వస్త్ర పరిశ్రమ కార్మికుల నిరసనలు కూడా హింసకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం నెలకు 12,500 టాకాలుగా ఉన్న కనీస వేతనాన్ని 30 వేల టాకాలకు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఢాకా, గాజీపూర్‌, సావర్‌ ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కొన్ని చోట్ల పోలీసులతో ఘర్షణలు జరగగా, వాహనాలు, ఫ్యాక్టరీలు, గోదాములపై దాడులు జరిగాయి. వందలాది వస్త్ర పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి.

హింస వెనుక హసీనా పార్టీ ఉందా?
దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల వెనుక నిషేధిత అవామీ లీగ్‌ కార్యకర్తలు ఉన్నారని బంగ్లాదేశ్‌ పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యమని పేర్కొంటున్నారు. నవంబర్‌ 1 నుంచి 7 వరకు బాంబు పేలుళ్ల కేసుల్లో కనీసం 21 మందిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అదే సమయంలో అవామీ లీగ్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 898 మందిని వేర్వేరు పోలీసు తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లు కూడా నిరసనలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ ఆందోళనలను కేవలం రాజకీయ కోణంలోనే చూడలేమని పరిస్థితులు సూచిస్తున్నాయి.

డిసెంబర్‌లో హసీనా రీఎంట్రీ?
2024 ఆగస్టులో భారీ ప్రజా నిరసనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్‌ హసీనా భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిసెంబర్‌లోగా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. అయితే ఆమెకు అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ 2025 నవంబర్‌లో గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఈ తీర్పును హసీనా రాజకీయ ప్రేరేపితమైనదిగా కొట్టిపారేశారు. మరోవైపు ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో హసీనా స్వదేశానికి తిరిగొస్తే ఆమె మద్దతుదారులు, వ్యతిరేక వర్గాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విభేదాలు, కార్మికుల సమస్యలు రెండూ కలిసి బంగ్లాదేశ్‌లో పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో ఊహించని ట్విస్ట్‌.. ఒక్క రోజులో మాట మార్చిన నెతన్యాహు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement