ఇజ్రాయెల్‌లో ఊహించని ట్విస్ట్‌.. ఒక్క రోజులో మాట మార్చిన నెతన్యాహు! | Netanyahu says national unity government still possible Twist In Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో ఊహించని ట్విస్ట్‌.. ఒక్క రోజులో మాట మార్చిన నెతన్యాహు!

Nov 12 2026 7:57 AM | Updated on Nov 12 2026 8:03 AM

Netanyahu says national unity government still possible Twist In Israel

జెరూసలేం: ఇజ్రాయెల్‌ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఆశించిన మెజారిటీ రాకపోవడం.. ప్రత్యర్థి గడి ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించడం.. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లెక్కలు సరిపోకపోవడంతో బెంజమిన్‌ నెతన్యాహు కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీశారు. నిన్నటి వరకు అరబ్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు జాతీయ ఐక్య ప్రభుత్వమే పరిష్కారమంటూ కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. దీంతో ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.

నెతన్యాహు బుధవారం క్నెసెట్‌ (ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌) ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ఐక్య ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇప్పటికీ సాధ్యమేనని ప్రకటించారు. నిన్న జాతీయ ఐక్య ప్రభుత్వం ఎందుకు అవసరమో చెప్పాను. ఈరోజు అది ఎందుకు సాధ్యమో చెబుతున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం కీలక పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అందరూ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. మతపరమైన, రాజకీయపరమైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ గత మూడేళ్ల యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌ ప్రజలు కలిసికట్టుగా పోరాడారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే ఐక్యత అవసరమని పేర్కొన్నారు. సాధ్యమైన సంకీర్ణ భాగస్వాములతో చర్చలు కొనసాగిస్తానని, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.

నిన్న అరబ్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు!
అయితే నెతన్యాహు తాజా ప్రకటనకు ముందు రోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. క్నెసెట్‌లో ప్రసంగిస్తూ అరబ్‌ ఎంపీలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారని, ఇజ్రాయెల్‌ ఉనికినే దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అరబ్‌ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి ప్రభుత్వంతో దేశ భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా జాతీయ ఐక్యత గురించి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.

ఇదిలా ఉండగా.. నెతన్యాహు ప్రతిపాదిస్తున్న ఐక్య ప్రభుత్వంలో ఆయన సొంత లికుడ్‌ పార్టీతో పాటు గత సంకీర్ణ భాగస్వాములు కూడా ఉండాలని భావిస్తున్నారు. వీరిలో రెలిజియస్‌ జియోనిజం, ఒట్జ్మా యెహుదిత్‌, అల్ట్రా ఆర్థడాక్స్‌ పార్టీలు ఉన్నాయి. అదే సమయంలో ప్రత్యర్థి రాజకీయ కూటమిలోని జియోనిస్ట్‌ పార్టీలను కూడా తనతో కలిసి రావాలని ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రతిపాదిత ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలనే విషయంలో నెతన్యాహు స్పష్టత ఇవ్వలేదు. తన పార్టీ అతిపెద్ద పార్టీ కావడంతో ప్రభుత్వానికి తానే నాయకత్వం వహించాలని ఆయన గతంలోనే తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లే కీలకం!
అక్టోబర్‌ 27న జరిగిన ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 120 స్థానాలున్న క్నెసెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ కూటమికి 53 స్థానాలు లభించగా, గడి ఐసెన్‌కోట్‌ నేతృత్వంలోని యషార్‌ పార్టీ, దాని భాగస్వాములకు 48 స్థానాలు వచ్చాయి. అరబ్‌ పార్టీలకు 19 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టడం ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది.

ఐసెన్‌కోట్‌ చేతిలో ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత!
ఈ రాజకీయ పరిణామాల మధ్య ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ నవంబర్‌ 8న గడి ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించారు. ప్రతిపక్ష కూటమికి మెజారిటీ మద్దతు సమీకరించే అవకాశం ఉందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఐసెన్‌కోట్‌ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తుండగా.. మరోవైపు నెతన్యాహు జాతీయ ఐక్య ప్రభుత్వం పేరుతో ప్రత్యర్థి పార్టీలకు ఆహ్వానం పలుకుతున్నారు. అయితే ఆయన ప్రతిపాదనకు ఇతర పార్టీలు ఏ మేరకు అంగీకరిస్తాయన్నది ఇంకా స్పష్టత లేదు. ఐసెన్‌కోట్‌ డిసెంబర్‌ 6 వరకు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. అవసరమైతే ఈ గడువును డిసెంబర్‌ 20 వరకు పొడిగించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఓటమి వేళ ట్రంప్‌కు మరో పరీక్ష..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement