అధ్యక్షుడు హెర్జోగ్ ఆహ్వానం
జెరూసలెం: ఇజ్రాయెల్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు ఐసాక్ హెర్జోగ్ యషర్ పార్టీ నేత గాడి ఐసన్‌కోట్‌కు ఆహ్వానం పలికారు. ఐసన్‌కోట్‌కు మొత్తం 67 మంది ప్రజాప్రతినిధులు మద్దతివ్వగా, ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ కూటమి 46 స్థానాల వద్ద నిలిచిపోయింది. ఐసన్‌కోట్ రానున్న 28 రోజుల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అవసరమైన పక్షంలో మరో 14 రోజుల అదనపు గడువు లభించవచ్చు. ఇజ్రాయెల్ పార్లమెంటులో మొత్తం 120 స్థానాలుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది మద్దతు అవసరం.
అక్టోబరు 27న జరిగిన ఇటీవలి ఎన్నికల్లో నెతన్యాహూ కూటమికి 48 స్థానాలు, ఐసన్‌కోట్ కూటమికి 53 స్థానాలు మాత్రమే లభించాయి. అరబ్ పార్టీలు 19 స్థానాలు గెలుచుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే.యునైటెడ్ తోరా జుడాయిజమ్‌కు చెందిన ఏడుగురు తటస్థంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు హెర్జోగ్ ఆదివారం రాజకీయ కూటములు అన్నింటితో చర్చలు జరిపారు. అరబ్ పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఐసన్‌కోట్‌కు 67 మంది సభ్యుల మద్దతున్నట్టు పరిగణించిన అధ్యక్షుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.


