ఖర్గే ‘ఈద్‌’ వ్యాఖ్యపై తీవ్ర దుమారం | Congress president Mallikarjun Kharge calls Diwali an Eid of joy | Sakshi
Sakshi News home page

ఖర్గే ‘ఈద్‌’ వ్యాఖ్యపై తీవ్ర దుమారం

Nov 10 2026 5:15 AM | Updated on Nov 10 2026 5:15 AM

Congress president Mallikarjun Kharge calls Diwali an Eid of joy

ఈద్‌ను దివాలీ ఆఫ్‌ జాయ్‌ అనగలరా అంటూ బీజేపీ సవాల్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే దీపావళి వేడుకను ఈద్‌ ఆఫ్‌ జాయ్‌గా అభివర్ణించడం తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. కాంగ్రెస్‌ పార్టీ తన బుజ్జగింపు రాజకీయాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ బీజేపీ తీవ్రంగా మండిపడింది. చేతనైతే ఈద్‌ను దివాలీ ఆఫ్‌ జాయ్‌ అనండంటూ సవాల్‌ విసిరింది. హిందువుల సంప్రదాయాలు, పండుగలంటే కాంగ్రెస్‌కు నచ్చదంటూ వీహెచ్‌పీ సైతం వ్యాఖ్యానించింది. 

కాంగ్రెస్‌ ఈ విమర్శలను దీటుగా తిప్పికొట్టింది. ఈద్‌కు అసలు అర్థం పండుగ అని, భాషాపరమైన అవగాహన లేని వారు మాత్రమే ఖర్గే వ్యాఖ్యలను తప్పుపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటైన దీపావళిని ఆయన ఖుషియోం కా ఈద్‌ (సంతోషాల పండుగ)గా అభివర్ణించారు. 

ఇదే వివాదానికి కారణమైంది. బీజేపీ ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ. హిందువుల మతపరమైన వేడుకలు, పండుగలను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందంటూ విమర్శించారు. ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఇది ఉందన్నారు. ముస్లింలను బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి హిందూ వ్యతిరేక, సనాతన వ్యతిరేక వ్యాఖ్యలకు పాల్పడుతోందన్నారు.

 కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాం«దీ, రాహుల్‌ గాంధీ వైఖరికి అనుకూలంగానే ఖర్గే ఈద్‌ అంటూ వ్యాఖ్యానించారన్నారు. ‘ఖర్గే ఉద్దేశంలో దీపావళి సంతోషాల ఈద్‌ అయినప్పుడు, ఈద్‌ కూడా సంతోషాల దీపావళి అవుతుంది. అలా అనగలరా?’అంటూ ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీని భాటియా ప్రశ్నించారు. పండుగలను కూడా కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోందన్నారు. 

హిందువుల పండుగలంటే కాంగ్రెస్‌కు నచ్చదు: వీహెచ్‌పీ 
కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ఈద్‌ వ్యాఖ్యలను వీహెచ్‌పీ సైతం తప్పుబట్టింది. కాంగ్రెస్‌ పార్టీకి హిందువుల సంప్రదాయాలు, పండుగలంటే ఏమాత్రం నచ్చదని పేర్కొంది. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరినట్లు తేలిపోతోందని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌ వ్యాఖ్యానించారు. ‘ఖర్గే వ్యాఖ్యలు సిగ్గుచేటు, దురదృష్టకరం, ఖండించదగినవి. 

యావత్తు హిందువులను అమానించేందుకు కాంగ్రెస్‌ చేసిన కుట్ర ఇది’అని బన్సాల్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘దేశంలో అత్యధికులైన హిందువులు జరుపుకునే దీపావళి పండుగ సైతం ఖర్గేకు ఈద్‌గానే కనిపిస్తోంది. మెజారిటీ హిందువుల సంప్రదాయాలను, ఘనమైన సంస్కృతీసంప్రదాయాలను ఎద్దేవా చేయడమంటే కాంగ్రెస్‌ నేతలకు ఎంత సంతోషమో? అంటూ వ్యాఖ్యానించారు. 

ఈద్‌ అసలు అర్థం పండుగ 
బీజేపీ, వీహెచ్‌పీ విమర్శలపై కాంగ్రెస్‌ ప్రచార విభాగం సారధి పవన్‌ ఖేరా స్పందించారు. అజ్ఞానులు, భాషాపరమైన అవగాహన లేని వారే తమ పార్టీ చీఫ్‌ ఖర్గే ప్రకటనపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈద్‌ అంటే అసలైన అర్ధం పండుగ అని ఆయన ఎక్స్‌లో తెలిపారు. దీపావళి పండుగ స్ఫూర్తితోనైనా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలని, తమపై అజ్ఞానంతో కూడిన బహిరంగ విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement