తుది దశకు ఎన్సీపీ విలీన ప్రక్రియ: మహారాష్ట్ర మంత్రి | Maharashtra Minister makes big claim | Sakshi
Sakshi News home page

తుది దశకు ఎన్సీపీ విలీన ప్రక్రియ: మహారాష్ట్ర మంత్రి

Nov 9 2026 1:40 AM | Updated on Nov 9 2026 1:40 AM

Maharashtra Minister makes big claim

ముంబై: మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన రెండు వర్గాల విలీన ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు రాష్ట్ర మంత్రి, శివసేన నేత సంజయ్ శిర్సాట్ వెల్లడించారు. త్వరలోనే ఏ నాయకుడికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై స్పష్టత వస్తుందని చెప్పారు. దీపావళి సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గాల మధ్య ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. రాజకీయంగా కీలక మార్పులు జరుగుతున్నాయని శిర్సాట్ అన్నారు.

‘‘రాజకీయంగా కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయని గతంలోనే చెప్పాను. ఇప్పుడు అవి జరుగుతున్నాయి. ఏ పార్టీ ఏ పార్టీలో విలీనం అవుతుందనేదే చూడాలి. నా అభిప్రాయం ప్రకారం ఈ పరిణామాలు తుది దశకు చేరుకున్నాయి. వివిధ నాయకుల పాత్రలపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

శనివారం అజిత్ పవార్ కుమారుడు, ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి పార్థ్ పవార్.. శరద్ పవార్‌ను దక్షిణ ముంబైలోని ఆయన నివాసంలో కలిశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అంతకుముందు ముంబై ఆస్పత్రిలో శరద్ పవార్‌ను ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కలవడం కూడా విలీనంపై చర్చలకు దారితీసింది. నవంబర్ 10 తర్వాత మరోసారి సమావేశమయ్యే విషయంపై వారిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెండు వర్గాలు విలీనమయ్యేవని, అజిత్ పవార్ జీవించి ఉంటే ఆ ప్రక్రియ అప్పుడే పూర్తయ్యేదని ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే ఇటీవల వ్యాఖ్యానించారు. జనవరి 28న విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన భార్య సునేత్రా పవార్ ప్రస్తుతం ఎన్సీపీ అధ్యక్షురాలిగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

2023లో చీలిన ఎన్సీపీ
శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో 2023లో చీలిక ఏర్పడింది. అజిత్ పవార్ నాయకత్వంలో ప్రఫుల్ పటేల్ సహా పలువురు నేతలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో చేరారు. అనంతరం అజిత్ పవార్ వర్గానికి అసలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తు దక్కాయి. శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్)గా కొనసాగుతోంది.

ఇటీవల సునేత్రా పవార్, ఆమె కుమారులు పార్థ్, జయ్ లేకుండానే ఎన్సీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పార్టీలో పార్థ్ పవార్ ప్రాధాన్యం పెరుగుతోందన్న అసంతృప్తి నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) మధ్య కూడా విలీనం జరిగే అవకాశం ఉందా అని శిర్సాట్‌ను మీడియా ప్రశ్నించింది. ఎవరైనా తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఆయన సమాధానమిచ్చారు.

మరోవైపు, కరువు ప్రభావిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.5,000 ఆర్థిక సాయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని శిర్సాట్ తప్పుబట్టారు. ఆ సాయం నచ్చకపోతే ప్రతిపక్షాలు కూడా రైతులకు అదే స్థాయిలో సహాయం చేయవచ్చని అన్నారు. లాడ్లీ బహిన్ పథకం విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించాయని విమర్శించారు.

రెండు ఎన్సీపీ వర్గాల విలీనంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. విలీనం జరిగితే నాయకత్వ బాధ్యతలు, అధికార పంపిణీ ఎలా ఉంటాయన్నది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement