సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆహార కల్తీ, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) భారీ తనిఖీలు చేపట్టింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం రూ.81.80 కోట్ల విలువైన 3,270 మెట్రిక్ టన్నులకు పైగా ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 1,133 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, మరో 52 లైసెన్సులను రద్దు చేసింది.
ఈ రెండు నెలల తనిఖీల్లో దేశవ్యాప్తంగా 56,431 ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనలపై 10,047 మెరుగుదల నోటీసులు జారీ చేశారు. మొత్తం 43,939 ఆహార నమూనాలను సేకరించగా, ఇప్పటివరకు 23,648 నమూనాలను పరీక్షించారు. వీటిలో 2,273 నమూనాలు ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.
నాణ్యత లేని నూనె, పాలు, పనీర్, స్వీట్లు, నెయ్యి, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, నమ్కీన్ తదితర ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 314 సంస్థలను సీజ్ చేయడంతో పాటు 410 కేసుల్లో ప్రాసిక్యూషన్ ప్రారంభించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా విభాగాల సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. పండుగల సమయంలో కల్తీ, నకిలీ, ప్రమాదకర ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: ప్రాణం తీసిన పార్కింగ్ వివాదం


