తక్కువ కొవ్వు, డిటర్జెంట్ ఆనవాళ్లు ఉన్నాయి
ప్రియాగోల్డ్ బిస్కెట్ల తయారీలోనూ నాణ్యతలేమి
ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడి
శివాజీనగర: కర్ణాటకలోని దొడ్ల డెయిరీ లిమిటెడ్కు చెందిన ఫుల్క్రీమ్ పాల నమూనాలో డిటర్జెంట్ లేదా కాస్టిక్ సోడా ఉన్నట్లు గుర్తించామని.. అలాగే, ఆ పాలలో కొవ్వు శాతం కూడా నిర్దేశిత పరిమితి కంటే తక్కువగా ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారణ అయిందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అనుమతిచ్చినట్లు తెలిపింది. కర్ణాటకలోని ఆ సంస్థ డెయిరీ నుంచి ఆహార భద్రతా అధికారులు పాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా పాలు లోపభూయిష్టంగా ఉన్నట్లు తేలింది. పరీక్షల మొదటి దశలో, పాలలో కొవ్వు శాతం ఆహార భద్రతా నిబంధనలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేదని, ఆ పాలను నాణ్యతలేని ఉత్పత్తిగా గుర్తించారు.
మరికొన్ని కంపెనీలపైనా చర్యలు..
ఆహార పరిశ్రమల సంఘం ప్రతినిధులు దీనిని సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసిన తరువాత, ఆ నమూనాను రెఫరల్ ఫుడ్ లాబొరేటరీకి పంపినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. అక్కడ జరిపిన పరీక్షల్లో పాలలో డీడీఏ లేదా కాస్టిక్ సోడా ఉన్నట్లు నిర్ధారణ అయిందని ప్రకటించింది. ఈ నివేదిక ఆధారంగా, అసురక్షితమైన, నిబంధనలకు అనుగుణంగా లేని, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు జరిగిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టంచేసింది.
అలాగే, ప్రియాగోల్డ్ పేరుతో బిస్కెట్లను తయారుచేసే సూర్య ఫుడ్ ఆగ్రో లిమిటెడ్ సహా ఇతర కంపెనీలపై కూడా నాణ్యత లేమి కింద చర్యలు తీసుకోనున్నారు. అంతేకాక.. యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నర్పధామ్ ఫుడ్స్, సన్ రిడ్నస్ హెల్త్ కేర్స్, షా కాంతిలాల్ జయంతిలాల్లకు నోటీసులు జారీచేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.


