బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, జెమినీ ఎడిబుల్స్పై కొరడా
వంటనూనెతో కొలెస్ట్రాల్ నియంత్రణ, గుండె ఆరోగ్యం మెరుగుదల సాధ్యమన్న ప్రచారంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చర్యలకు ఉపక్రమించింది. ‘ఫ్రీడమ్ కుకింగ్ రైస్ బ్రాన్ ఆయిల్’కు సంబంధించి తప్పుదోవ పట్టించే ఆరోగ్య ప్రయోజనాల ప్రకటనలు చేసినట్లు ఆరోపణలతో జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్, బిగ్‌బాస్కెట్ నిర్వహణ సంస్థ ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్, ఫ్లిప్‌కార్ట్ ఇండియాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా..
సదరు ప్రచారంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను కొనసాగించడం లేదా పెంచడం సాధ్యమని పేర్కొన్నట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. అలాగే, సహజ ఓరిజనాల్ పరిమాణం 10,000 పీపీఎంకు మించి ఉంటుందని ప్రచారం చేసిన అంశాన్నీ ప్రస్తావించింది. ఈ వాదనలు వినియోగదారుల్లో ఆరోగ్య ప్రయోజనాలపై అపోహలు కలిగించే అవకాశముందని ఎఫ్ఎస్ఎస్ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆహార ఉత్పత్తుల ప్రకటనలు, ఆరోగ్య సంబంధిత వాదనలపై 2018 నాటి నిబంధనల ప్రకారం రైస్ బ్రాన్ ఆయిల్‌కు ఇటువంటి కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్య ప్రయోజనాలు అనుమతిలో లేవని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006 కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని మూడు సంస్థలను ఆదేశించింది.
ఈ-కామర్స్ లైసెన్సుపైనా ప్రశ్నలు
ఇదే సమయంలో, జెమిని ఎడిబుల్స్ తన సొంత ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పటికీ ఆ కార్యకలాపాలకు అవసరమైన చెల్లుబాటు అయ్యే సెంట్రల్ లైసెన్సు లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఈ పరిణామం ఆహార ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయాల్లో ప్రకటనల విశ్వసనీయత, నియంత్రణ నిబంధనల అమలుపై దృష్టి సారించేలా చేసింది. అయితే, నోటీసుల జారీ అనేది తప్పులకు తుది నిర్ధారణ కాదు. సంబంధిత సంస్థల వివరణలు, తదుపరి విచారణ ఆధారంగానే చట్టపరమైన చర్యలపై నిర్ణయం వెలువడనుంది.
ఇదీ చదవండి: రోజూ చూసే రూపీ సింబల్ వెనుక దాగున్న రహస్యాలు


