ఫ్లిప్‌కార్ట్ సీఈవో అనూహ్య రాజీనామా.. | Flipkart CEO Kalyan Krishnamurthy To Step Down After 11 Years | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్ సీఈవో అనూహ్య రాజీనామా..

Nov 25 2026 5:47 PM | Updated on Nov 25 2026 5:51 PM

Flipkart CEO Kalyan Krishnamurthy To Step Down After 11 Years

భారత ఈ-కామర్స్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి అనూహ్యంగా తన పదవి నుంచి వైదొలిగారు. కంపెనీలో 11 ఏళ్లకు పైగా కొనసాగిన ఆయన ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు నవంబర్ 25న సంస్థ అధికారికంగా వెల్లడించింది. తదుపరి సీఈవోను రాబోయే వారాల్లో ప్రకటించనున్నట్లు తెలిపింది.

కొత్త సీఈవో నియామకం జరిగే వరకు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ త్యాగరాజన్, కంపెనీ బోర్డు కలిసి సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నాయి. అయితే కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగడానికి గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు.

ఐదింతలు పెరిగిన వ్యాపారం

కల్యాణ్ కృష్ణమూర్తి నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం ఐదింతలకు పైగా విస్తరించింది. భారత ఈ-కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఆయన హయాంలోనే ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే 'బిగ్ బిలియన్ డేస్' దేశంలో అతిపెద్ద పండుగ షాపింగ్ కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వినియోగదారులు, విక్రేతల కోసం కొత్త సేవలను ప్రవేశపెట్టడంతో పాటు దేశవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది.

2016లో ఫ్లిప్‌కార్ట్‌లో తిరిగి చేరిన కల్యాణ్ కృష్ణమూర్తి.. 2017 జనవరిలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2018లో గ్రూప్ సీఈవోగా నియమితులయ్యారు. అదే ఏడాది అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సుమారు 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ పరిణామాల సమయంలోనూ ఆయన సంస్థకు నాయకత్వం వహించారు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌కు 50 కోట్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులు ఉన్నారు. 80కి పైగా విభాగాల్లో 15 కోట్లకు పైగా ఉత్పత్తులను అందిస్తోంది. షాప్సీ విక్రేతలతో కలిపి 14 లక్షలకు పైగా విక్రేతలు ఈ వేదికపై వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ భవిష్యత్తు వృద్ధిపై వాల్‌మార్ట్ విశ్వాసం వ్యక్తం చేసింది. భారత్‌లో సంస్థకు ఉన్న అవకాశాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సీఈవో క్రిస్ నికోలస్ పేర్కొన్నారు.

తాను సంస్థతో కలిసి సాగించిన ప్రయాణంపై గర్వంగా ఉందని కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. వ్యాపార విస్తరణతో పాటు నైతిక విలువలు, పారదర్శకత, మెరుగైన పాలనా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఫ్లిప్‌కార్ట్ విజయానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వచ్చే కొత్త టెక్నాలజీలో.. 2 లక్షల ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement