న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ మౌలిక సదుపాయాలకు రుణ సదుపాయం కల్పించే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా బీవోబీ గ్రీన్ ప్లగ్ ఫైనాన్సింగ్ స్కీమును ప్రవేశపెట్టింది. దీని కింద రూ. 10 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు రుణాలు అందిస్తుంది.
కొత్త స్టేషన్స్ ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించేందుకు స్టార్టప్‌లు, ఈవీ చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లు, ఫ్లీట్ ఆపరేటర్లు మొదలైన వర్గాలు ఈ రుణాలను పొందవచ్చు. వీటిపై వడ్డీ రేట్లు వార్షికంగా 8.15 శాతం నుంచి 9.60 శాతం వరకు ఉంటాయి. కేఫెటేరియాలు, యుటిలిటీలు మొదలైన వాటి ఏర్పాటు కోసం కూడా ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు.
రుణ చెల్లింపునకు 10 ఏళ్ల గడువు
ఈ పథకం కింద తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు గరిష్ఠంగా 120 నెలల (10 ఏళ్ల) గడువు కల్పిస్తున్నారు. ఇందులో ప్రారంభ దశలో గరిష్ఠంగా 12 నెలల మారటోరియం సదుపాయం కూడా ఉంటుంది. అంటే ప్రాజెక్టు ఏర్పాటు, కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో రుణగ్రహీతలకు కొంత వెసులుబాటు లభిస్తుంది. వడ్డీ రేటు బ్యాంకు బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (BRLLR), తీసుకునే రుణ మొత్తం, రుణగ్రహీత క్రెడిట్ రేటింగ్‌పై ఆధారపడి ఉంటుంది.
రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌తో పనిచేసే ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు. కేఫెటేరియాలు, ఇతర అనుబంధ సదుపాయాల కోసం కేటాయించే రుణం మొత్తం మంజూరైన రుణంలో 25 శాతం లేదా రూ.కోటి.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతకే పరిమితం. అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న సంస్థలకు నిబంధనల ప్రకారం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) కింద గ్యారెంటీ కవరేజీ కూడా లభించే అవకాశం ఉంది.


