న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయ వనరులను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీలకు చెందిన భూముల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ శ్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్‌ఎల్) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్, సీఈఎస్‌ఎల్ సీఈఓ అఖిలేశ్ కుమార్ దీక్షిత్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట, గ్రామ పంచాయతీ కార్యాలయాల సమీపంలోని అనువైన ప్రభుత్వ స్థలాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలతోపాటు భారీ వాహనాలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
స్థలాల గుర్తింపు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసే బాధ్యతను పంచాయతీరాజ్ శాఖ చేపడుతుంది. కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలను సీఈఎస్‌ఎల్ చూసుకుంటుంది. ఈ మౌలిక సదుపాయాల ద్వారా పంచాయతీలకు సొంత ఆదాయ వనరులు (ఓఎస్‌ఆర్) సమకూరడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.


