పంచాయతీల్లో చెక్కుల చిక్కులుండవ్‌! | Government issues key directives for payment of essential service bills | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో చెక్కుల చిక్కులుండవ్‌!

Oct 2 2026 4:33 AM | Updated on Oct 2 2026 4:33 AM

Government issues key directives for payment of essential service bills

అత్యవసర సేవల బిల్లుల చెల్లింపులకు సర్కార్‌ కీలక ఆదేశాలు 

జాయింట్‌ చెక్కులపై సంతకాలకు ఉపసర్పంచ్‌లకు ఏడురోజుల గడువు 

సంతకాలు చేయని పక్షంలో కలెక్టర్‌ విచారణ  

మరో చట్టబద్ధ అధికారికి చెక్‌ డ్రాయింగ్‌ పవర్‌  

పీఆర్‌ఆర్‌డీ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ మెమో జారీ

సాక్షి, హైదరాబాద్‌ : గ్రామ పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా చర్యలు చేపట్టింది. చెక్కులపై సంతకాలు చేయడం లేదా వ్యయాన్ని డిజిటల్‌ సిగ్నేచర్‌ కీ ద్వారా ఆమోదించడంలో ఉప సర్పంచ్‌లు అనవసరంగా జాప్యం చేస్తే చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. పీఆర్‌ మంత్రి సీతక్క సూచనలకు అనుగుణంగా గురువారం పీఆర్‌ఆర్‌డీ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ మెమో జారీ చేశారు. 

ఈ ఆదేశాలను వెంటనే అమలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. పలు గ్రామ పంచాయతీల్లో కొంతమంది ఉప సర్పంచ్‌లు సరైన కారణం లేకుండా చెక్కులపై సంతకాలు చేయకపోవడం వంటి ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు ఉప సర్పంచ్‌ల మధ్య ఆధిపత్య, రాజకీయ, ఇతర కారణాల వల్ల బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతోందని, సర్పంచ్‌ చెక్‌పై సంతకాలు చేసినా, ఉప సర్పంచ్‌లు సంతకాలు చేయడం లేదని పలువురు సర్పంచ్‌లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 

దీంతో పంచాయతీల్లో ఆయా పనులకు సంబంధించిన వ్యయాన్ని డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారా ఆమోదించకపోవడం వల్ల చెల్లింపులు ఆలస్యం అవుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సర్పంచ్‌ సంఘాలు మంత్రి సీతక్కను పలుమార్లు కలిసి, ఉప సర్పంచ్‌ల వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడుతోందని, జాయింట్‌ చెక్‌ పవర్‌ను రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం ఉపసర్పంచ్‌లు సంతకం చేసేందుకు ఏడు రోజుల గడువు విధిస్తూ మెమో జారీ చేసింది. 

కలెక్టర్లకు విచారణ అధికారం  
బిల్లులకు సంబంధించిన చెక్కులపై సంతకం చేయాలని లేదా డిజిటల్‌ సిగ్నేచర్‌ కీ ద్వారా వ్యయాన్ని ఆమోదించాలని ఉప సర్పంచ్‌కు సమర్పించిన తేదీ నుంచి ఏడు పనిదినాల్లోగా సరైన కారణం లేకుండా సంతకం చేయకపోతే.. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సంతకం చేయకపోవడానికి లేదా వ్యయాన్ని ఆమోదించకపోవడానికి నిజమైన కారణం ఉందా లేదా అనే అంశాన్ని విచారణలో పరిశీలించనున్నారు. ఒకవేళ ఉప సర్పంచ్‌ ఉద్దేశపూర్వకంగా చెక్కులపై సంతకం చేయకుండా లేదా డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారా వ్యయాన్ని ఆమోదించకుండా జాప్యం చేసినట్టు తేలితే తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం, 2018 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.  

మరొకరికి చెక్‌ డ్రాయింగ్‌ పవర్‌  
ఉప సర్పంచ్‌ సరైన కారణం లేకుండా చెక్కులపై సంతకం చేయడం లేదా వ్యయాన్ని డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారా ఆమోదించడంలో జాప్యం చేసినట్టు విచారణలో తేలితే, చెక్కులను డ్రా చేసే అధికారాన్ని మరో చట్టబద్ధమైన అధికారికి అప్పగించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అధికారాన్ని పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ, ఎంపీడీఓ తదితర చట్టబద్ధ అధికారుల్లో తగిన వారికి అప్పగించే అవకాశం కల్పించారు.

చట్టబద్ధమైన అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. కానీ సరైన కారణం లేకుండా చెల్లింపులను నిలిపివేయడం మాత్రం అనుమతించబోమని తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్‌ శాఖ సూచించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement